పథకాలపై ప్రజలకు అవగాహన

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడమే వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర లక్ష్యమని జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌

  • జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌

ప్రజాశక్తి – రణస్థలం రూరల్‌

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడమే వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర లక్ష్యమని జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ తెలిపారు. మండలంలోని కోటపాలెంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పథకాల కింద అర్హులైనా, ఇప్పటివరకు ప్రయోజనం పొందని బలహీనవర్గాలకు అందిస్తామన్నారు. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల పరధిలో ఈ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాకు ఒక ప్రచారం వాహనం రాగా, మరో ఏడు వాహనాలు వస్తున్నాయని తెలిపారు. రోజూ రెండు గ్రామాలు చొప్పున వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 పథకాల గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇంకా లబ్ధి పొందని వారికి వెంటనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తామని, రైతులకు డ్రోన్ల ద్వారా పురుగుమందులు, ఎరువుల పిచికారీ చేసుకునే విధానాన్ని చూపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️