పత్తి ఏరుతున్న రైతులు
- ఉమ్మడి జిల్లాలో రాజాంలో కొనుగోలు
- జిల్లా పునర్విభజన తర్వాత జిల్లాలో ఏర్పాటు కాని కేంద్రం
- ఎచ్చెర్లలో ఏర్పాటుకు అధికారుల ప్రతిప్రాదనలు
- ఇంకా తేల్చని ప్రభుత్వం
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, లావేరు
ఆరుగాలం కష్టించి పండిన పత్తి పంట దళారుల పాలవుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. జిల్లాలో పత్తి కొనుగోలు చేయకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రాజాంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏటా పత్తి కొనుగోలు చేసేది. జిల్లాల పునర్విభజన తర్వాత రాజాం విజయనగరం జిల్లాలో చేరడంతో, జిల్లాలో కొనుగోలు కేంద్రమే లేకుండా పోయింది. జిల్లాకు సంబంధించి ఎచ్చెర్లలో కేంద్రం ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు పంపినా, ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,763 ఎకరాల్లో పత్తి సాగు అయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది 4,620 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని అంచనా వేశారు. పంట సాగు తగ్గినా, దిగుబడి పర్వాలేదని రైతులు చెప్తున్నారు. సుమారు 30 వేల క్వింటాళ్ల వరకు పత్తి పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పత్తి పంట మొదటి రకానికి (పొడుగు గింజ పత్తి) క్వింటాకు రూ.7020, రెండో రకం (పొట్టిగింజ)కు రూ.6,625 ప్రకటించింది. మద్దతు ధర ప్రకటన కాగితాలకే పరిమితమైంది. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ధర దక్కడం లేదు. ప్రభుత్వపరంగా కొనుగోలు చేయకపోవడమే ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో ప్రతి ఏడాది రాజాంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేవారు. కష్టమో, నష్టమో అక్కడకు వెళ్లి రైతులు తమ పంటను అమ్ముకునేవారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో అటు వ్యాపారులు, దళారులూ ప్రభుత్వం కంటే కాస్త ఎక్కువ ధరే చెల్లించిన పరిస్థితి ఉండేది. గతేడాది క్వింటా పత్తికి రూ.7,500 నుంచి రూ.8 వేల వరకు పలికేది. ప్రస్తుతం రూ.ఆరు వేలకు మించి వ్యాపారులు కొనడం లేదని రైతులు చెప్తున్నారు.రైతుల అవసరమే ఆసరాగా…ప్రభుత్వపరంగా జిల్లాలో పత్తి కొనుగోలు చేపట్టడం లేదు. పత్తి కొంటే తామే కొనాలి తప్ప ఎవరూ కొనే పరిస్థితి లేదని వ్యాపారులు అనుకుంటున్నారు. ఇదే అదనుగా బేరసారాలు సాగిస్తున్నారు. పత్తి నాణ్యంగా లేదని, తేమ ఉందంటూ వెళ్లిపోతున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు బాగాలేకపోవడం, పంటను దాచుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు ఇచ్చిన ధర తీసుకుంటున్నారు.పంట అమ్ముకుందామంటే ధర లేదుఈ ఏడాది ఎకరాన్నర భూమిలో పత్తి వేశాం. అప్పు చేసి రూ.30 వేల వరకు మదుపులు పెట్టాను. పంట అమ్ముకుందామంటే ధర లేదు. గతేడాది బహిరంగ మార్కెట్లో రూ.7,500 వచ్చింది.
ఇప్పుడు రూ.ఆరు వేలే ఇస్తామంటున్నారు.
ప్రభుత్వం కొంటే కొంత ఎక్కువ ధర వచ్చేది. వాతావరణం బాగాలేదు. పంటను ఎన్నాళ్లు ఇంట్లో దాచుకుంటాం. వ్యాపారులు చెప్పిన ధరకే ఇచ్చేస్తున్నాం.
– శాంతాటి సీతమ్మ, గుర్రాలపాలెం, లావేరు
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
మూడు ఎకరాల్లో పంట వేశాను. పంట ప్రారంభంలో మంచి ధర ఉండేది. క్వింటా రూ.8 వేలు వరకు పలికేది. పంట చేతికొచ్చాక ధర తగ్గిపోయింది. ప్రభుత్వమే కొంటే ధర పడిపోయేది కాదు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.
– ఎ.నర్సింగరావు, అదపాక, లావేరు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో పత్తి పంట కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు ప్రతిపాదనలు పంపాం. ఎచ్చెర్లలో ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుందని ఆగస్టులో రాశాం. పత్తి కొనుగోలుకు సిసిఐ అంగీకరిస్తే కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తాం.
– ఐ.గంగాధర్, సహాయ సంచాలకులు, మార్కెటింగ్ శాఖ