ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 24న హంస నావికోత్సవం (తెప్పోత్సవం) నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంద్రపుష్కరిణి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవ నిర్వహణకు అవసరమైన హంస వాహనాన్ని సిద్ధం చేయడంతో పాటు పుష్కరిణిలో ట్రయల్ రన్ కూడా వేశారు. ఉషా, ఛాయా, పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలతో తిరువీధి నిర్వహించిన అనంతరం వాటిని ఇంద్ర పుష్కరణి వద్దకు చేర్చి పూలతో ముస్తాబు చేసిన హంస నావిక రథంలోకి తీసుకొస్తారు. అక్కడ్నుంచి ఇంద్రపుష్కరిణిలో వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్ మాట్లాడుతూ హంస వాహనాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సిద్ధం చేశామన్నారు. మత్స్యశాఖ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు బీమా కల్పించిన వ్యక్తులకు మాత్రమే తెప్పలోకి అనుమతిస్తారు. అదనంగా హంస వాహనంలోకి ఇతర వ్యక్తులను అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ఆలయంలో ద్వాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని స్వామి వారికి ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వర్ణ్ణాలంకరణ చేపడతామన్నారు. సందర్శకులకు మొబైల్ ఫోన్స్, కెమెరాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. హంస వాహనం ట్రయల్ రన్‌లో అగ్నిమాపక, పోలీస్, మత్స్యశాఖ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.