సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్
- పేరుకే బిసి మంత్రులు… పెత్తనమంతా రెడ్లదే
* జగన్ అరాచకాలను ప్రశ్నించలేని మంత్రులు
- టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బిసిలు, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ విమర్శించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పాలనలో 74మంది బిసిలు, 28 మంది దళితులు హత్యకు గురయ్యారని తెలిపారు. ఏడు వేల మంది బిసిలు, నాలుగు వేల మంది దళితులపై దాడులు, అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసిన జగన్ ప్రభుత్వంలో బిసి, ఎస్‌సి మంత్రులమని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎవరిని మోసగించడానికి సామాజిక సాధికారిత యాత్రలు చేపడుతున్నారని ప్రశ్నించారు. పేరుకే బిసి మంత్రులు తప్ప పెత్తనం అంతా రెడ్లదేనని విమర్శించారు. బొత్స, ధర్మాన, తమ్మినేని, సీదిరి రెడ్ల వెనకాల పదవుల కోసం తిరుగుతున్నారని చెప్పారు. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారాలను ప్రశ్నించిన మహిళా నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించారని, అటువంటి సమయంలో ఈ నాయకులు ఎందుకు కళ్లు మూసుకున్నారని ప్రశ్నించారు. అసభ్యకర పోస్టులపై ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని, గౌతు శిరీష, పంచుమర్తి అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్డి రాజ్యంలో పట్టించుకునే వారు కరువయ్యారని ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రజక, యాదవ, నాయీబ్రాహ్మణ, మత్స్యకార, గీత కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించినట్లు తెలిపారు. బిసిలకు గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా అందిస్తున్న 30 పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీల్లో తొమ్మిది మంది విసి పోస్టులను రెడ్లకే కట్టబెట్టారని తెలిపారు. బిసిలు, ఎస్‌సిలు పాలనకు అర్హులు కారా అని ప్రశ్నించారు. బిసిలకు అండగా నిలుస్తున్న చంద్రబాబుపై కుట్ర చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా బిసి మంత్రులు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జగన్‌ను ప్రశ్నించాలన్నారు. అనంతరం రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, బొనిగి భాస్కరరావు, నాయకులు సింతు సుధాకర్, మాదారపు వెంకటేష్, ఎస్‌సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి రమణ మాదిగ, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు జి.చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.