మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
- వచ్చే నెలాఖరుకు ప్రభుత్వ భవనాలు పూర్తి
- జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు
- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న కుల గణన సర్వేకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. కలెక్టరేట్ నుంచి ఎంపిడిఒలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా సర్వే సమాచారాన్ని రెండు రోజుల ముందే ప్రజలకు తెలిపేలా పత్రికా ప్రకటనలు స్థానికంగా విడుదల చేయాలని సూచించారు. గార మండలం రామచంద్రాపురంలో పైలట్ సర్వే విజయవంతంగా పూర్తయిందన్నారు. జిల్లా కేంద్రంలో సర్వే కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాలను డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న ఈ పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు బిల్లులు త్వరగా అప్‌లోడ్ చేయాలని సూచించారు. 20 శాతం పనులు జరిగితే పూర్తయ్యే భవనాల విషయంలో ఎలాంటి అలసత్వం పనికి రాదన్నారు. ఏజెన్సీలు, ఇంజనీరింగ్ సిబ్బందితో ప్రతి వారం ఎంపిడివోలు సమీక్షించి నేరుగా కలెక్టరేట్‌కు నివేదిక పంపాలని ఆదేశించారు. ఆరోగ్య సురక్షలో నాలుగు లక్షల మంది వైద్యులను కలిశారని, అందులో 5,450 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు అవసరమని గుర్తించామన్నారు. వారిలో ఇప్పటివరకు 1583 మంది నెట్‌వర్క్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకున్నారని తెలిపారు. సెట్‌శ్రీ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్రాకు కిట్లు సిద్ధంగా ఉన్నాయని, ఆదివారానికి ఆయా ఎంపిడిఒలు వీటిని మండల కేంద్రాలకు తీసుకువెళ్లే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆటల పోటీలు నిర్వహించే రోజుల్లో ఆయా సచివాలయాలకు పంపించాలని చెప్పారు. వీటి రవాణా ఛార్జీల కోసం మండలానికి రూ.మూడు వేలు చొప్పున చెల్లిస్తామన్నారు. మైదానాలు సిద్ధం చేయడం, రిఫరీలను గుర్తించే పని వేగంగా పూర్తి చేయాలన్నారు. 26న వికసిత భారత్ సంకల్ప యాత్రకేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, అర్హులైన వారికి అందేలా చేయడం వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. ఈ యాత్ర జిల్లాలో ఈనెల 26న ప్రారంభమై రెండు నెలల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని ఎంపిడిఒలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి వాసుదేవరావు, సిపిఒ వి.ఎస్.ఎస్ లకీëప్రసన్న, జిల్లా బిసి సంక్షేమ అధికారి అనురాధ, సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు, చీఫ్ కోచ్ శ్రీదర్, హౌసింగ్ పీడీ ఎన్.గణపతి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వి.ఎస్.ఎన్ మూర్తి, ఎంపిడిఒలు తదితరులు పాల్గొన్నారు.