కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీ

కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఓటర్ల జాబితా పరిశీలకులు జె.శ్యామలరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని

సమావేశంలో మాట్లాడుతున్న శ్యామలరావు

  • జిల్లా పరిశీలకులు జె.శ్యామలరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఓటర్ల జాబితా పరిశీలకులు జె.శ్యామలరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజు నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితా సవరణలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను నమోదు చేసుకుని, లిఖితపూర్వకంగా సమర్పించిన వినతులను తీసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అత్యంత పారదర్శకంగా జాబితాలను తయారు చేస్తామని హామీనిచ్చారు. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ మాట్లాడుతూ చనిపోయిన వారి, డబుల్‌ ఎంట్రీల తొలగింపు చేపట్టాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు జాబితాలను తమకు అందజేయాలని కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు ఓటర్ల జాబితాలో ప్రత్యేక గుర్తింపు మార్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకరరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై తమకు ఎటువంటి అభ్యంతరాల్లేవన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల సమన్వయంతో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి వారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కాంగ్రెస్‌ నాయకులు గోవింద మల్లిబాబు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో సమస్యలను తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జయదేవి, శ్రీకాకుళం, పలాస ఆర్‌డిఒలు సిహెచ్‌.రంగయ్య, భరత్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️