ఎచ్చెర్ల యాత్ర టిడిపికి హెచ్చరిక

ఎచ్చెర్ల నియోజకవర్గ సామాజిక సాధికార యాత్రకు తరలివచ్చిన జనమే టిడిపి ఓటమికి ఒక హెచ్చరిక అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఎచ్చెర్ల మండలం

మాట్లాడుతున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • ప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర
  • చంద్రబాబును మట్టి కరిపించాలి : ధర్మాన
  • బిసిలను టిడిపి అవమానించింది : సీదిరి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, రణస్థలం

ఎచ్చెర్ల నియోజకవర్గ సామాజిక సాధికార యాత్రకు తరలివచ్చిన జనమే టిడిపి ఓటమికి ఒక హెచ్చరిక అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టిడిపికి ధనమే బలమైతే వైసిపికి జనం, జగనే బలమన్నారు. చంద్రబాబు 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌ ఇస్తే, జగన్‌ 60 ఏళ్లకే ఇస్తున్నారని చెప్పారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమం, పాలనాపరంగా అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రూ.300 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ కేటాయించిందని, దీనికోసం మత్స్యకారులు ఉద్యమాలు, ఆందోళనలు చేస్తే వచ్చాయా అని ప్రశ్నించారు. మత్స్యకారులతో ఓట్లు వేయించుకున్న టిడిపి 2014లో మత్స్యకారులకు ఎమ్మెల్యే సీటు హామీనిచ్చి మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు చెందిన మత్స్యకారుడికి మంత్రి పదవి ఇచ్చి, వారి సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీనిచ్చి మోసం చేశారని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.13,500 ఇస్తున్నారని, చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకుని వారికి రూ.24 వేలు అందిస్తున్నారని, ఇలా అన్ని తరగతుల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు సాయంగా అందిస్తున్న డబ్బులను చంద్రబాబు వృధా అంటున్నారని, అటువంటి వారికి అవకాశమిస్తారా అని ప్రశ్నించారు. పరిపాలనా రాజధానికి విశాఖ అనువైన ప్రాంతమని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిన చంద్రబాబును మట్టి కరిపించాలన్నారు. నాయకుల మధ్య మనస్పర్థలు ఉండొచ్చు గానీ అవి పార్టీకి ఇబ్బంది కలిగించకూడదన్నారు. కిరణ్‌ కుమార్‌ గెలుపునకు సమిష్టి కృషి పనిచేయాలని సూచించారు.శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీగా జనం పోటెత్తుతుండడం టిడిపి హయాంలో జరిగిన అన్యాయానికి ప్రజలు తీర్చుకుంటున్న ప్రతీకారమని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పించి సామాజిక సాధికారతను సాధించడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు.రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలను అవమానించిన పరిస్థితులను చూశామని చెప్పారు. ఎచ్చెర్లలో ఒక సమస్యపై చంద్రబాబును కలిసిన సందర్భంలో తోలుతీస్తామంటూ బెదిరించారని గుర్తు చేశారు. హార్బర్లు కట్టరంటూ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నారని, 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబు ఏ రోజైనా ఎక్కడైనా హార్బర్లు, పోర్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారా అని ప్రశ్నించారు.సభాధ్యక్షులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పధకాలను అందిస్తున్నారని, వాటిని సహించలేక ప్రతిపక్ష పార్టీలు కుట్రలతో ఓడించాలని చూస్తున్నారని చెప్పారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ తరగతులకు మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించడంతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.బిసిల అభ్యున్నతే ధ్యేయంగా పాలన : కృష్ణదాస్‌బిసిల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. రణస్థలంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 కులాలకు సంబంధించి 36 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బిసిలను ఆదుకున్న ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా పైడిభీమవరంలో అన్ని వర్గాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, నియోజకవర్గ పరిశీలకులు ఎన్‌.నాయుడుబాబు, ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, జెడ్‌పిటిసి టి.సీతారాం, ఎల్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.యాత్రతో జనానికి అవస్థలుబస్సు యాత్రతో జనానికి అవస్థలు తప్పలేదు. చిలకపాలెంలో సభ నిర్వహణకు పొందూరు రోడ్డుపై అడ్డంగా వేదిక ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పొందూరు నుంచి ప్రధాన రహదారికి చేరుకునే మార్గంలో ఆంక్షలు విధించడంతో కిలోమీటరు దూరంలోనే వాహనాలు ఆపేశారు. దీంతో పిల్లలు, వృద్ధులు నడుచుకుంటూ చిలకపాలెం ప్రధాన రహదారికి చేరుకున్నారు. సభ ఏర్పాట్లలో భాగంగా రోజంతా దుకాణాల ముందు బారికేడ్లు కట్టడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి. సభలో కూర్చొనేందుకు పూర్తిస్థాయిలో కుర్చీలు వేయకపోవడంతో, వచ్చిన జనం ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. తోపులాటలో చిక్కుకుపోతామనే ఆందోళనతో కొందరు మహిళలు బయటకు వచ్చేశారు. శాసససభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతుండగా పార్టీ కార్యకర్తలు గోలపెడుతుండటంతో ఆపమంటూ రెండు, మూడు పర్యాయాలు చెప్పారు. వారు అదే కొనసాగిస్తుండటంతో ఆయన అసహనంతో మధ్యలోనే ప్రసంగం ఆపేశారు.

 

➡️