అంగన్వాడీల సమ్మె నోటీసు

అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్‌ 8 నుంచి నిరవధికంగా జరిగే సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరుతూ

ప్రజాశక్తి- ఆమదాలవలస

అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్‌ 8 నుంచి నిరవధికంగా జరిగే సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరుతూ సిడిపిఒ ఎస్‌.గీతకు కార్యాలయంలో సెక్టార్‌ పరిధిలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు అలాగే బూర్జ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు 2022 సంవత్సరంలోనే గ్రాడ్యూటీ చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ నేటికీ అమలు చేయడం లేదని వెంటనే అమలు చేయాలని కోరారు. మినీ సెంటర్లను తక్షణమే మెయిన్‌ సెంటర్లుగా మార్చి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్‌గా ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించి రాజకీయ జోక్యాన్ని అరికట్టి పదోన్నతి వయస్సును 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. విధుల్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమాను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్‌ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, బకాయి పడిన సెంటర్‌ 2017 నుంచి టిఎ బిల్లులు, ఇతర బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా సహాయ కార్యదర్శి పంచాది లతా దేవి, ప్రాజెక్టు కార్యదర్శి పి. భూలక్ష్మి, మొదలవలస లత, పి. లక్ష్మి, డి.రమాదేవి, జి.అనురాధ, లక్ష్మి, కళావతి, ఎస్‌.రవణమ్మ కె.జ్యోతి పాల్గొన్నారు.

సిడిపిఒకు సమ్మె నోటీసును అందజేస్తున్న లతాదేవి

➡️