శాస్త్రీయ దృక్ఫథాన్ని అలవర్చుకోవాలి

Nov 24,2023 21:52

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

చిలమత్తూరు : విద్యార్థులుచ ప్రజలు శాస్త్రీయ దృక్ఫథాన్ని అలవరుచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు. దేశవ్యాప్త శాస్త్ర ప్రచార ఉద్యమంలో భాగంగా చిలమత్తూరు మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు అవగాహనకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మూఢ నమ్మకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జెవివి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నవంబర్‌ 7 నుండి 2024 ఫిిబ్రవరి 28 వరకు శాస్త్ర ప్రచార ఉద్యమం చేపడుతున్నామని అన్నారు. జీవపరిణామ క్రమం, విశ్వపరిణామ క్రమం, సమాజ పరిణామ క్రమం అనే అంశాలు తెలియని వాళ్లు పాలకులుగా ఉన్నప్పుడు దేశం అశాస్త్రీయ పద్దతులలో ముందుకు పోతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో పాలకులు సూడో సైన్స్‌ను ముందుకు తీసుకెలుతున్నారని అన్నారు. మూఢ నమ్మకాలు పెరిగిపోయి తల్లిదండ్రులు వారి బిడ్డలను చంపుకుంటున్నారని అన్నారు. అలాంటి సంఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొదించాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. అందుకనే శాస్త్రీయ యాత్ర చేపడుతున్నామని అన్నారు. కరోనా సమయంలో శ్రీకృష్ణదేవరాయుల విశ్వ విద్యాలయ వీసీకరోనా నియంత్రిస్తామని యజ్ఞాలు, యాగాలు చేయడం చూస్తే విద్యార్థులలో మూఢనమ్మకాలను ప్రోత్సహించినటైందని అన్నారు. ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ సమాజాన్ని శాస్త్రీయంగా చైతన్యం చేసేందుకు ఈ యాత్ర కొనసాగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెవీవీ పూర్వ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్‌ హరి గంగాధర్‌, ప్రిన్సిపల్‌ నాగరాజు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ : జెవివి ఆధ్వర్యంలో చేపట్టిన నేషనల్‌ సైంటిఫిక్‌ టెంపర్మెంట్‌ కాంపెయిన్‌ లో భాగంగా శుక్రవారం పట్టణంలోని పరిటాల డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, జెవివి రాష్ట్ర పూర్వ కార్యదర్శి కె.శ్రీనివాస్‌,జెవివి జిల్లా కార్యదర్శి హరి, వైస్‌ ప్రిన్సిపల్‌ జయప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ 1988 ఫిబ్రవరి 28న నేషనల్‌ సైన్స్‌ డే సందర్బంగా జెవివి ఏర్పడినప్పటి నుంచి సైన్స్‌ ఆవిష్కరణ ఫలాలు ప్రజలందరికీ అందాలని జెవివి ప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రశ్నించే తత్వం అలవాటు అయినప్పుడు సబ్జెక్టు తెలుస్తుందన్నారు. జెవివి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలకు విజ్ఞానం అందించే పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️