రైతుపై ‘మీటర్ల’ పిడుగు..!

Nov 27,2023 20:25

వ్యవసాయ బోరుబావులకు ఏర్పాటు చేసిన మీటర్లను చూపుతున్న రైతులు లక్ష్మిదేవమ్మ, రంగనాథ్‌

      అగళి : రైతులపై విద్యుత్‌ భారాల పిడుగు వేగవంతం అయ్యింది. వ్యవసాయ బోరుబావులకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చకచకా అమలు చేయించేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా అగళి మండలంలో మోటార్లుకు మీటర్లు బిగించే కార్యక్రమానికి విద్యుత్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులు మీటర్లను ఏర్పాటు చేయొద్దని వారిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వాటిని బిగించేసి వెళ్తున్నారు. సోమవారం ఒక్క రోజే పి.బ్యాడిగెర పంచాయతీ కెంకర గ్రామంలో 16 మీటర్లను ఏర్పాటు చేశారు. పి.బ్యాడిగెర పంచాయతీ కెంకర గ్రామానికి సోమవారం ఉదయం విద్యుత్‌ అధికారులు వెళ్లారు. వ్యవసాయ పొలాల వద్దకెళ్లి బోరుబావులకు మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కెంకర గ్రామంలో ఒక రోజులోనే 16 మీటర్లను బిగించేసి వెళ్లారు. చాలా మంది రైతులు పొలాల వద్ద లేకున్న సమయంలో వీటిని బిగించారు. కొంత మంది రైతులకు ఫోన్లు చేసి పొలాల వద్దకు పిలిపించారు. మీటర్లు బిగించొద్దు అంటూ రైతులు విద్యుత్‌ అధికారులను అడ్డుకున్నా వారు వినలేదు. ప్రభుత్వం, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశం అంటూ రైతులు రంగనాథ్‌, శివన్న, లక్ష్మిదేవమ్మ, సన్నచిక్కన్న, తోపన్నతో పాటు 16 మంది పొలాల్లో వ్యవసాయ బోరుబావులకు మీటర్లను బిగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మీటర్లను తీసుకుని వచ్చి బిగించేశారు. విద్యుత్‌ అధికారుల వద్ద ఏ రైతుల పొలాలకు మీటర్లు బిగించాలనే జాబితా మొత్తం ఉంది. సోమవారం నాడు అగళి మండలం పి.బ్యాడిగెర పంచాయతీ కెంకర గ్రామానికి వచ్చిన అధికారుల వద్ద మీటర్లు బిగించాల్సిన రైతుల జాబితా మొత్తం ఉంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల నెంబర్‌ ప్రకారం మీటర్లును బిగించేలా ఉన్నతాధికారుల నుంచి రైతుల పేర్లతో జాబితా వచ్చినట్లు విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు ఇలాంటి జాబితా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ అవుతుందంటూ బెదిరింపులు..

    వ్యవసాయ బోరుబావులకు మీటర్లు బిగిస్తున్న సమయంలో పలువురు రైతులు విద్యుత్‌ అధికారులను నిలదీశారు. మీటర్లు వద్దంటూ వారించారు. అయినా విద్యుత్‌ అధికారులు వినలేదు. మీటర్లు బిగించుకోకుంటే విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ అవుతుంటూ బెదిరించారు. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించి పలువురు రైతులు ఏమీ చేయలేక నిస్సాహాకస్థితిలో ఉండిపోయారు.

➡️