రాష్ట్రంలో జగన్‌ రాజ్యాంగం అమలు : మాజీ ఎంపి

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపి హర్ష కుమార్‌

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపి హర్ష కుమార్‌

        మడకశిర : రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం బదులు జగన్‌ రాజ్యాంగం అమలవుతోందని అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్‌ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ అవసరం లేదని, వర్గీకరణతో వైశ్యామ్యాలు ఏర్పడతాయి తప్ప ఒరిగేదేమీ లేదని, మనమందరం అన్నదమ్ముల్లా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణం లోని సాయిబాబా దేవాలయం ఆవరణలో గురువారం వనికే ఓబవ్వ జయంత్యుత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హర్షకుమార్‌, మైసూరు సంస్థాన మఠాధిపతి ప్రకాష్‌ స్వామీజీ, కర్నాటక మాజీ ఎమ్మెల్యే నెహ్రూ వాలేకర్‌, అనంతపురం చిన్నపిల్లల వైద్య నిపుణులు దినకర్‌, హిందూపురం ఆర్‌డిఒ మోహన్‌దాస్‌, పశు వైద్యాధికారి రాజన్న హాజరయ్యారు. ముందుగా సాయిబాబా దేవాలయం నుంచి స్వామీజీ, హర్షకమార్‌లను పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం సాయిబాబా దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో హర్ష కుమార్‌ మాట్లాడుతూ గతంలో పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందేదని, ప్రస్తుత జగన్‌ ప్రభుత్వంలో స్కాలర్‌షిప్‌ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాజ్యాధికారంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాలలు వెనుకబడి ఉన్నారన్నారు. 30 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం వర్గీకరణ గురించి అడగడం లేదని కొన్ని రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణ కావాలని పట్టుబడుతున్నట్లు తెలిపారు. వనికే ఓబవ్వ చరిత్రను ప్రజలకు కూలంకశంగా వివరించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించారు. ఏమైనా రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనరసప్ప, సోమ్‌కుమార్‌, కృష్ణమూర్తి, ఇనగలూరు వెంకటస్వామి, కాచికుంట వెంకటేష్‌, చిట్నడకు శ్రీధర్‌, పలుకూరు పాండురంగమూర్తి, జయరామప్ప, మడకశిర సోమన్న, మందలపల్లి బసవరాజు, నాగరాజు, గంగాధర్‌, నరసింహమూర్తి, ఎమ్మార్‌ మూర్తి, గురుస్వామి, హనుమంతరాయప్ప, నారాయణప్ప, వెంకటేష్‌, మంజునాథ్‌, నియోజకవర్గంలోని ఐదు మండలాలు, కర్నాటక నుంచి మాల కులస్తులు భారీగా తరలివచ్చారు.

➡️