మత్తుపదార్థాల నియంత్రణకు చర్యలు : డిఆర్‌ఒ

సమావేశంలో పాల్గొన్న డిఆర్‌ఒ, అడిషనల్‌ ఎస్పీ

         పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో మత్తు పదార్థాలను పూర్తిగా నియంత్రించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని డిఆర్‌ఒ కొండయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హల్‌లో జిల్లా అడిషనల్‌ ఎస్పీ విష్ణుతో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని డిఆర్‌ఒ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా నాలుగో శనివారం డ్రగ్స్‌ నియంత్రణపై జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన కమిటీలు చురుగ్గా పని చేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మారమూల గ్రామాలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలో మత్తు పదార్థాల నివారణపై పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని 14500 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వెంటనే ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.రవికుమార్‌, అర్బన్‌ సిఐ కొండారెడ్డి, హర్ష, డిఅండ్‌హెచ్‌ఒ ఎస్‌వి.కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఒ తిప్పినాయక్‌, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్‌, డీఈఓ మీనాక్షితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️