చేనేతలకు సముచిత స్థానం కల్పించాలి

సమావేశంలో మాట్లాడుతున్న బండారు ఆనంద్‌ ప్రసాద్‌

        ధర్మవరం టౌన్‌ : రాజకీయ పార్టీలు చేనేతలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా అనగదొక్కే సంస్కృతిని విడనాడి ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించాలని చేనేత జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ధర్మవరం పట్టణంలోని శమీనారాయణస్వామి దేవాలయంలో చేనేత కులస్తుల ఐక్యవేదిక రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆనంద్‌ ప్రసాద్‌తో పాటు రాష్ట్ర చేనేత అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్‌, ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కోడిపల్లి రాజీ, మాజీ పార్లమెంట్‌ సభ్యులు నిమ్మల కిష్టప్ప, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెవి.శేషయ్య తదితరులు హాజరయ్యారు. ముందుగా కదిరి గేటు వద్దగల చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి బైకుర్యాలీ నిర్వహిస్తూ సమావేశం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ సంస్కతి, సాంప్రదాయాలు నేర్పిన చేనేత కులస్తులకు శాసనసభలో ఒక్కరికి కూడా అవకాశం లేకపోవడం సామాజిక రుగ్మతగా భావిస్తున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో చేనేతజౌళి శాఖను సైతం నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా చేనేతలను గుర్తించకుంటే రానున్న ఎన్నికలలో తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. చేనేతలను విస్మరిస్తే రాజకీయ పార్టీలను బహిష్కరిస్తామన్నారు. మహిళా నాయకురాలు జయశ్రీ మాట్లాడుతూ చేనేతలంతా ఐకమత్యంతో ముందుకెళ్లాలన్నారు. ధర్మవరం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎక్కువ శాతం అగ్రకులాల వారే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. చేనేతల ఓటు బ్యాంకు ఎక్కవగా ఉన్న వారికి ఇక్కడ అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక నాయకులు రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్‌ బడిగింజలు చంద్రమౌళి, రాష్ట్ర దేవాంగ అధ్యక్షులు డికె.నాగరాజు, రాష్ట్ర తొగట వీరక్షత్రియ మహిళా అధ్యక్షురాలు సురుగు శ్రీలత, నాయకులు చింతా శ్రీనివాసులు, కదిరి నాగరాజు, బొమ్మశెట్టి కృష్ణమూర్తి, డిజి.ఆదినారాయణ, చందా రాము, ధర్మవరం చేనేత నాయకులు గిర్రాజు రవి, బండారు ఆదినారాయణ, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ గడ్డం పార్థసారధి, ఉడుముల రాము, పోలా వెంకటనారాయణ, పరిసే సుధాకర్‌, గిర్రాజు నగేష్‌, మెటికల కుళ్లాయప్ప, జింక రాజేంద్రప్రసాద్‌, అజరు పాల్గొన్నారు.

➡️