చిరువ్యాపారులపై సుంకంబాదుడు

ఫుట్‌ పాత్‌ వ్యాపారాలు వద్ద గుమి కూడిన కొనుగోలుదారులు

          పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి 98వ జయంతి వేడుకల సందర్భంగా పట్టణంలో విద్యగిరి వద్ద రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌ వ్యాపారాలు వెలిశాయి. గృహ ఉపయోగకర వస్తువులను ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతి ఏటా బాబా జయంతి వేడుకలు ముగిసిన తర్వాత వారం రోజులపాటు గృహ ఉపయోగకర వస్తువులను వివిధ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు తీసుకొచ్చి పుట్టపర్తిలో వ్యాపారం చేస్తుంటారు. పిల్లలకు సంబంధించిన బ్యాటు, బాళ్లు, విజిల్‌ వేసే వస్తువులు, బెల్టులు, బ్యాగులు వివిధ రకాల బంతులు, స్వెట్టర్లు, మప్లర్లు, అలంకరణ ప్లాస్టిక్‌ పూలు, పింగాణి కప్పులు, ప్లాస్టిక్‌ కప్పులు, మగ్గులు, పెనములు తదితర వస్తువులు విక్రయిస్తున్నారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల నుంచి పిల్లలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. చిన్న గుడారాలు వేసుకుని ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు రాత్రి సమయంలో వర్షం వచ్చినా తట్టుకుని అక్కడే ఉంటున్నారు. వ్యాపారుల పరిస్థితి ఇలా ఉంటే వీరిపై సుంకాల బాదుడు మరింత అధ్వానంగా ఉంది. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా సుంకం వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మామూలుగా ఒక దుకాణానికి రోజుకు 5 రూపాయల సుంకం ఉంటుంది. అలాంటిది ఇక్కడ సుంకం కాంట్రాక్టర్‌ రూ.100 రూ.200 వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సుంకం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.

➡️