ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ
ప్రజాశక్తి-ఉరవకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని పాఠశాలలో నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయిన దుస్థితి నెలకొన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను తెరవకముందే నాడు నేడు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందనీ పాఠశాలలు తెరిచి నేటికీ ఐదు నెలలు పూర్తి కావస్తున్నా ఎక్కడ పనులు అక్కడే ఉండి కొన్నిచోట్ల నిలిచిపోయాయన్నారు. ఉరవకొండ మండల కేంద్రంలోని పాతపేట ఎంపీపీ స్కూల్లో నాడు నేడు పనులు పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులకు తరగతి గదులు లేక ఆరుబయటే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా నాడు నేడు పనులు పూర్తి కాకపోవడానికి గుత్తేదారులు చెబుతున్న కారణం ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని విద్యాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పనులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న నాడు నేడు పనులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించి పనులను పూర్తి చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తాసిల్దార్ శ్రీధర్ మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు హిరణ్య, నందు, మహేష్, రాజేష్, వంశి, అశోక్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.