రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

Nov 23,2023 13:33 #Anantapuram District

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున
ప్రజాశక్తి-అనంతపురం(రాయదుర్గం) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగసంస్థలు ముఖ్యంగా రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటియు అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున పిలుపునిచ్చారు. రైల్వేల ప్రైవేటీకరణకు, మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల పట్ల వ్యవహరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు నాయకులతో కలిసి గురువారం రాయదుర్గంలోని రైల్వే స్టేషన్ ముందు గంటపాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ఆస్తిగా చెప్పుకునే రైల్వేలను ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రైల్వేలను ప్రైవేటుపరం చేస్తే ప్రయాణికులపై విపరీతమైన భారాలు పడే అవకాశం ఉందని అన్నారు, అదేవిధంగా రైల్వే సంస్థలో పనిచేసే ఉద్యోగులు కార్మికుల కు భద్రత లోపిస్తుందని అన్నారు. ప్రజల ఆస్తి అయిన రైల్వేలను ప్రైవేటు పరం చేసే నైతిక హక్కు మోడీ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రైల్వేల ప్రైవేటీకరణ విధానాన్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రయాణికుల భద్రతను కాపాడాలని అదేవిధంగా రైల్వేలో అన్ని విభాగాల్లో 3.5 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘా లు, రాజకీయ పార్టీలు, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు, మధు, అంజి, రమేష్, కృష్ణ నాయక్, హనుమంతు, ఓబులేష్ బాబు, శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, డివైఎఫ్ఐ నాయకులు అనిల్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️