పంట దెబ్బతిన్న ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం

Sep 10,2024 20:49

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు ఎన్‌ఎండి ఫరూక్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి

పంట దెబ్బతిన్న ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం
– నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తాం
– మంత్రులు ఎన్‌ఎండి ఫరూక్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని, ఇళ్లు, పశు సంపద, రోడ్లు, తదితర ఆస్తి నష్ట వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ఇతర ఆస్తుల నష్టాలపై సంబంధిత అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎన్‌ఎండి ఫరూక్‌, బీసీ జనార్దన్‌ రెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల వల్ల 86 గ్రామాలలో పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తులకు నష్టం జరిగిందని చెప్పారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 9,958 హెక్టార్లలో 42 కోట్ల రూపాయలు విలువైన పంట నష్టం, కచ్చా గృహాలు 25 పూర్తిగా, 230 పాక్షికంగా గృహాలు దెబ్బతిన్నాయన్నారు. ఒక పాడి గేదె, 45 గొర్రెలు మృత్యువాత పడటంతో పాటు కాటిల్‌ షెడ్‌ కూడ దెబ్బతిందన్నారు. 206 కిలోమీటర్ల రహదారులు, 24 సీడి వర్క్స్‌, 142 విద్యుత్‌ స్తంభాలు, 33 స్కూళ్లలో కిచెన్‌ షెడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. దెబ్బతిన్న పంట పొలాలను సరిగ్గా లెక్క వేయలేదని మీడియాలో వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా లెక్క కట్టాలని ఆదేశించారు. చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలోని మల్లారెడ్డి కుంటకు గండ్లు పడి వరద నీరు వస్తుందని, శాశ్వత ప్రాతిపదికన డిపిఆర్‌ నివేదికల సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. ఎస్‌ఆర్‌బిసి కాలనీకి వెళ్లే దారిలో కుందూనదిపై 2017 నుంచి బ్రిడ్జి పెండింగ్‌లో ఉందని, సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమయ్యే యూరియా, డిఏపి ఎరువులను తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ ఆగస్టు 31 నుండి కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని 22 మండలాలలోని 86 గ్రామాలలో పంట పొలాలు, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రులకు వివరించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ సిద్దాపురం చెరువు పూర్తిగా నిండిందని, ఏమాత్రం వర్షం వచ్చినా బండ్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని, ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికతో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు నష్టం వివరాలను వివరించారు. అనంతరం స్వచ్ఛతాహి సేవ గోడ పత్రికను మంత్రులు, జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. అలాగే నంద్యాల పట్టణానికి చెందిన పి.పావని వరద బాధితుల సహాయార్థం రూ. 5 వేలు సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేశారు.

తాజా వార్తలు

➡️