ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ తదితరులు
అభివృద్ధికి బాటలు వేస్తున్నాం
– రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని 2వ వార్డు చింతరుగు వద్ద ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ పట్టణాలు, గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రమే ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఈ మేరకు అన్ని పట్టణాలు, గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం-ప్రజావేదిక కార్యక్రమాలు వారం రోజులు పాటు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద రహదారులు, మురికి కాల్వలు నిర్మిస్తామన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలని, రాజీ పడొద్దని మంత్రి సూచించారు. అనరతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అంతకుముందు మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రాల ద్వారా కొందరు తమ సమస్యలను విన్నవించారు. మరి కొందరు తమ ఇబ్బందులను తొలగించాలని అభ్యర్థించడంతో తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, 2వ వార్డు టిడిపి ఇన్చార్జ్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.