విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి

Sep 10,2024 20:47

రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి
– కేంద్ర ప్రభుత్వమే నడపాలి
– సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో
ప్రజాశక్తి – నంద్యాల
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని, కేంద్ర ప్రభుత్వమే నడపాలని సిఐటియు నేతలు డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేయిల్‌ సంస్థకు ఇచ్చి పూర్తి సామర్థ్యంతో నడిపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం నంద్యాల పట్టణంలోని కోవెలకుంట్ల-నూనెపల్లి జంక్షన్‌లో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై రోజుకో మాట మాట్లాడడం సరైనది కాదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును అభివృద్ధి దిశగా నడిపేందుకు చర్యలు చేపట్టాలని, సేయిల్‌ సంస్థకు ఇచ్చి పూర్తి సామర్థ్యంతో నడిపితే స్టీల్‌ ప్లాంట్‌ మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రకు మణిహారం లాంటిదని, అటువంటి సంస్థను నిర్వీర్యం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవన్నారు. గత సంవత్సరం ఆరు నెలలకు పైగా స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులు దీక్షలు చేశారని తెలిపారు. కార్మికుల చేస్తున్న దీక్షలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడటంలో 32 మంది కార్మికులు, నాయకులు బలయ్యారని, ఎంతోమంది వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి పోరాడారని చెప్పారు. పోరాట ఫలితంగా రాష్ట్రంలో ఏర్పాటైన స్టీల్‌ ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం ప్రవేటుపరం చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రానున్న కాలంలో స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, రాష్ట్ర ప్రజలంతా సిఐటియు పోరాటాలకు ఐక్యంగా కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కే మహమ్మద్‌ గౌస్‌, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, జిల్లా సహాయ కార్యదర్శి వెన్న బాల వెంకట్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️