ట్యూషన్‌ సెంటర్‌ పిల్లల్లో మార్పునకు దోహదం

Sep 22,2024 20:26

ట్యూషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన డాక్టర్‌ క్రాంతి చైతన్య, బి.శంకరయ్య తదితరులు

ట్యూషన్‌ సెంటర్‌ పిల్లల్లో మార్పునకు దోహదం
– ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్‌ క్రాంతి చైతన్య
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ట్యూషన్‌ సెంటర్‌ వారిలోని మార్పునకు దోహదపడుతుందని గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్‌ క్రాంతి చైతన్య అన్నారు. ఆదివారం నంద్యాలలోని రైల్వే గూడ్స్‌ షెడ్‌ ఏరియాలోని ఏకే గోపాలన్‌ భవన్‌లో అక్కడి పేద పిల్లలకు ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్‌ సెంటర్‌ను ఇండస్‌ గుండె జబ్బుల ఆసుపత్రి నిర్వాహకులు, ప్రముఖ కార్డియాలజీస్టు డాక్టర్‌ క్రాంతి చైతన్య ముఖ్యతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ రామరాజు అధ్యక్షత వహించారు. అనంతరం డాక్టర క్రాంతి చైతన్య మాట్లాడుతూ విద్య ప్రధానమైందని, పేద విద్యార్థుల కోసం నంది విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్‌ సెంటర్‌ను ప్రారంభించడం అభినందనీయమని, ఇలాంటివి మరిన్ని శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు చేయూత నివ్వాలని నిర్వాహకులను కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. మాజీ కౌన్సిలర్‌ బి.శంకరయ్య మాట్లాడుతూ ఇక్కడ పిల్లల్లో విద్య పట్ల భయాన్ని దూరం చేస్తూ సృజనాత్మకతను వెలికితీయనున్నట్లు తెలిపారు. ట్యూషన్‌ సెంటర్స్‌ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. తల్లిదండ్రులు అందరు కూడా పిల్లలను కచ్చితంగా ట్యూషన్‌ సెంటర్‌కి పంపించి విద్యాభివృద్ధిని కాంక్షించాలన్నారు. కార్యక్రమంలో నంది విజ్ఞాన కేంద్రం నాయకులు జి.భాస్కర్‌, ఎ.నాగేంద్ర ప్రసాద్‌, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు గోపాల్‌, యుటిఎఫ్‌ నాయకులు రమణ, చిన్నయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️