సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
మున్సిపాలిటీ స్థలాల కబ్జాల్లో ఎలాంటి మార్పు లేదు
– నంద్యాలలో వైసిపి చేసిన తప్పులే టిడిపి కూడా చేస్తోంది : సిపిఎం
ప్రజాశక్తి – నంద్యాల
నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ స్థలాల కబ్జాల విషయంలో గత వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం కూడా చేస్తుందని సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు విమర్శించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ స్థలాలు గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు గురయ్యాయని అన్నారు. నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం నేడు అదే తప్పులను చేస్తుందని అన్నారు. మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చే స్థలాలను నేడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కబ్జాలు చేయడం పద్ధతి కాదన్నారు. గతంలో వైసిపి ఇదే భూకబ్జాలు చేసి అధికారం కోల్పోయిందని, ఇప్పుడు టిడిపి కూడా అదే తప్పులు చేస్తే ఇదే చివరి అవకాశం అవుతుందని అన్నారు. కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ స్థలాలను కబ్జా చేసిన వారి నుండి తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కోరారు. కోట్ల విలువైన స్థలాలు కాబట్టే అధికార టీడీపీ నాయకులు కన్నేశారని, వాటిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. తాజాగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతునగర్ సచివాలయం ఆవరణంలోని వర్మీకంపోస్టుకు సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించేందుకు పన్నాగం పన్నారన్నారు. ఇది మున్సిపాలిటీకి చెందిన స్థలమని బహిరంగంగా అందరికి తెలిసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉండడం తగదన్నారు. నంద్యాల వాసులకు సుపరిచతమైన నాగులకుంట రోడ్డులోని పాలకొమ్మచెట్టు ఉన్న ప్రాంత మున్సిపాలిటీ స్థలం నేడు టీడీపీ నాయకులు కబ్జా చేసి ఏకంగా షాపింగ్ కాంప్లెక్సు నిర్మించారన్నారు. ఈ స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని, రామకృష్ణా విద్యాలయం సంజీవనగర్ రైతుబజార్ పక్కన ఉన్న స్థలాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాలు కబ్జా చేయడం వెనుక న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి హస్తం ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారని, కాబట్టి తక్షణమే ఎన్‌ఎండి ఫరూక్ స్పందించి ఈ స్థలాలన్నింటినీ మున్సిపాలిటీకి అప్పజెప్పే పని చేయాలని కోరారు. లేకపోతే గతంలో వైసిపికి పట్టిన గతే టిడిపికి పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కేఎండి గౌస్, డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.