పోలీస్‌ అమరవీరుల సేవలు మరువలేనివి

Oct 21,2024 21:02

పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న కలెక్టర్‌, ఎస్‌పి తదితరులు

పోలీస్‌ అమరవీరుల సేవలు మరువలేనివి
– జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి, ఎస్‌పి అధిరాజ్‌ సింగ్‌ రాణా
– ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, ప్రజారక్షణ కోసం చేసే త్యాగం మహోన్నతమైనదని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి, జిల్లా ఎస్‌పి అధిరాజ్‌ సింగ్‌ రాణాలు అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యతిధిగా కలెక్టర్‌ జి.రాజకుమారి హాజరయ్యారు. పోలీస్‌ అమరవీరులకు ఘనంగా నివాళ్లులర్పించారు. ముందుగా పెరేడ్‌ కమాండర్‌ నాగభూషణం నుండి కలెక్టర్‌, ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదన్నారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన, గౌరవప్రదమైన అత్యంత బాధ్యతాయుతమైన ఉద్యోగమని చెప్పారు. పోలీసులు అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకొనుటకు ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పరిగణిస్తున్నామన్నారు. పోలీసు సంక్షేమానికి సంబంధించిన ఆరోగ్య భద్రత, జీతాల ప్యాకేజీ, భద్రత రుణం, భద్రత వివాహ రుణం, భద్రత గృహ రుణం వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్‌ సిబ్బంది ఐక్యత కోసం శిక్షణ, క్రీడా పోటీలు, భదఖానా మొదలగు వాటిని ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని, పోలీస్‌ సిబ్బంది ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు రూ. 25 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఏఆర్‌ డిఎస్పీ శ్రీనివాసులు విధి నిర్వహణలో మరణించిన వారి వివరాలను వివరించారు.

➡️