సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
గతం ఒక లెక్క… ఇప్పటి నుండి మరో లెక్క..
– కేంద్ర పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
– జిల్లా సమగ్రాభివృద్దికి కషి చేద్దాం : ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో కొందరు అధికారులు గత ప్రభుత్వ మైకంలోనే ఉన్నారని, వాటి నుండి బయటపడాలని, గతం ఒక లెక్కా, ఇప్పటి నుంచి మరో లెక్క అని,కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా కమిటీ ) చైర్మన్ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులందరం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని కోరారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటనరీ హాల్‌లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నంద్యాలలోనే కేంద్రీయ విద్యాలయం, నవోదయ స్కూల్ మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. గత వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒక విద్యాశాఖ నుంచే పనులు సకాలంలో పూర్తి చేయనందున 700 కోట్ల రూపాయలు వెనక్కు వెళ్ళాయని, ఆ తప్పు పునరావృతం కాకుండా అన్ని శాఖలు సకాలంలో పనులు పూర్తి చేసి ఎక్కువ నిధులు రాబట్టేందుకు అధికారులు పనిచేయాలని కోరారు. 53 శాఖల అధికారుల నివేదికలపై దిశా కమిటీ సమావేశంలో శాఖల వారిగా సమీక్షించారు. దిశా కమిటీ కన్వీనర్, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాఖల వారిగా సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు, జరుగుతున్న పనుల పురోగతి, ఎక్కడైనా ఆలస్యమైతే కారణాలు ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు, కొత్త పథకాల మంజూరుకు సంహకరించాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఎంపిపిలు ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిని పరిష్కరించి, అన్ని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, డిప్యూటీ సిఇఒ వెంకట సుబ్బారెడ్డి, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.