అ(కొ)ందరికా..?

Oct 22,2024 19:22

గ్యాస్‌ సిలిండర్లు

అ(కొ)ందరికా..?
– దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌కు సన్నాహాలు
– వినియోగదారుల్లో పలు సందేహాలు
– మంత్రివర్గ సమావేశంలో తేల్చే అవకాశం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దీపావళి నుంచి ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఇప్పటికే వెల్లడించారు. ఈ పథకం విధివిధానాలు, అర్హతలు ప్రభుత్వం ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ పథకం ఎవరికి వర్తిస్తుందోనని వినియోగదారుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ పేరుతో పలు హామీలను ఇచ్చింది. ఎన్నికల్లోకి వచ్చిన తరువాత పింఛన్ల పెంపునకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత మిగతా హామీలను అమలు చేసేందుకు సాహసం చేయలేదు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్‌ సిక్స్‌లో ఒక హామీ అయిన ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దీపావళి (అక్టోబర్‌ 31) నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. అయితే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు? తమకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ వస్తుందా లేదా? అని వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 6.74 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 2.4 లక్షల దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 5.77 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 1.55 లక్షల దీపం కనెక్షన్లు, 33,732 పిఎం ఉజ్వల యోజన కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని వర్తింపజేస్తుందా? లేక కొందరికే వర్తింపజేస్తుందా? అనే సందేహం వినియోగదారుల్లో పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే 14.6 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ రూ.856 ఉంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి వినియోగదారునికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు ఏడాదికి కర్నూలు జిల్లాకు రూ.170 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.148 కోట్ల వరకూ అవసరం ఉంటుంది. ప్రభుత్వం పలు కొర్రీలు పెట్టి వీలైనంత తక్కువ మందికి ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వెళ్లే యోచనలో ఉందని ఇప్పటికే ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.మొదట కొంటే..ఖాతాలో డబ్బు.. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని డిబిటి విధానంలో అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత గ్యాస్‌ సిలిండర్‌ను మామూలుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.25 రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుదారుల ఖాతాలో జమ చేసేలా నిర్ణయించనున్నట్లు సమాచారం. మూడు ఉచిత సిలిండర్లు కూడా ఒక దాని తరువాత ఒకటి కాకుండా నాలుగు నెలలకాలానికి ఒక సిలిండర్‌ చొప్పున ఇవ్వన్నున్నారు. డిబిటి విధానంలో ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వం సిలిండర్‌ కొనుగోలు చేసిన మొత్తాన్ని ఖాతాల్లో జమచేయకపోతే ఎలా అని వినియోగదారుల నుంచి సందేహం వ్యక్తం అవుతోంది. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు వచ్చే వరకూ తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం అమరావతిలో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ పథకానికి సంబంధించిన విధివిధానాలను కూడా ఆ సమావేశంలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం.

➡️