సీతారాం ఏచూరి జీవితం ప్రజా సేవకు అంకితం

Sep 14,2024 20:53

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ నాయకుడు టి. రమేష్‌ కుమార్‌

సీతారాం ఏచూరి జీవితం ప్రజా సేవకు అంకితం
– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ నాయకుడు టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
కామ్రేడ్‌ సీతారాం ఏచూరి తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ నాయకులు టి.రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నంద్యాలలోని వెలాసిటీ కళాశాలలో సీతారాం ఏచూరి సంతాప సభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌ నాయక్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ నాయుకులు టి. రమేష్‌ కుమార్‌, మాజీ జిల్లా నాయుకులు పుల్ల నరసింహులు, వెలాసిటీ కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాసులు పాల్గొని ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీతారాం ఏచూరి ఎస్‌ఎఫ్‌ఐలో చురుకైన నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఆయన వరుసగా మూడుసార్లు జెఎన్‌యు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. 1975 ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సీతారాం ఏచూరి నేతృత్వంలో జరిగిన విద్యార్థి పోరాటం, ప్రధాని ఇందిరా గాంధీని సైతం జెఎన్‌యు ఛాన్సలర్‌ పదవి నుండి వైదొలగడానికి దోహదం చేసిందని గుర్తు చేశారు. దేశంలో జరిగిన విద్యార్థి ఉద్యమంలో వీరోచిత సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయిందన్నారు. భారతదేశంలోని ఫాసిస్ట్‌, ఫండమెంటలిస్ట్‌ శక్తులకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటానికి నాయకత్వం వహించారని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఏచూరి జీవితాన్ని, విద్యార్థి ఉద్యమానికి, దేశంలోని శ్రామిక ప్రజల కోసం పోరాటానికి చేసిన కృషిని గౌరవిస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద ఆదర్శాల కోసం పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐకి అయన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజా, పట్టణ నాయుకులు హర్ష, కిషోర్‌, హుస్సేన్‌, వెలాసిటీ కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు .

➡️