రెడ్‌ సెల్యూట్‌ సీతారాం ఏచూరి

Sep 14,2024 20:58

ఈ వారం నంద్యాల

రెడ్‌ సెల్యూట్‌ సీతారాం ఏచూరి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. సీతారాం ఏచూరికి కర్నూలుతో అనుబంధం ఉంది. పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. చాలా సార్లు ఆయన కర్నూలుకు విచ్చేశారు. 2003 నవంబర్‌ 30న పీపుల్స్‌ డెమోక్రసీ ఎడిటర్‌గా ఉన్న ఆయన ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో సిపిఎం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎ.గఫూర్‌ పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2013 మే 19న కర్నూలు సుందయ్య భవన్‌లో నిర్వహించిన సుందరయ్య శత జయంతి ఉత్సవాల్లో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ఆయన పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్స్‌ మీట్‌లోనూ పాల్గొన్నారు. 2016లో కర్నూలు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిస్టుల బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 2019 డిసెంబర్‌ 28న కర్నూలు నగరంలో ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ, బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పలువురు వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న కొద్ది మంది మేధావులలో ఏచూరి ఒకరు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రత్యేకతను చాటిచెప్పిన వ్యక్తి అయన. 2004లో యూపిఎ వన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. పార్లమెంట్‌లో, పార్లమెంటు బయట ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఆయన ముందుండేవారు. ప్రత్యేకించి కర్నూలు జిల్లా ఉద్యమంతో అనేక సందర్భాల్లో ప్రత్యక్ష సంబంధాలు ఆయనకు ఉన్నాయి. విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఎం ప్రధాన కార్యదర్శి వరకూ సాగింది. తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన నవ్వుతూనే ఇతర పార్టీలపై, బిజెపి విధానాలపై విమర్శలు గుప్పించే వారు. లౌకికవాదం కోసం అందరినీ ఏకం చేయడం కోసం బలంగా పని చేశారు. ఆయన ఆశయాలను సాధించడం కోసం కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్‌ సీతారం ఏచూరి…జిఒ 115 రగడ : జీవో నెంబర్‌ 115 స్టాఫ్‌ నర్సులు, ఎఎన్‌ఎంల మధ్య చిచ్చు పెడుతోంది. ఏఎన్‌ఎంలకు రెండేళ్లు శిక్షణ ఇచ్చి నేరుగా స్టాఫ్‌ నర్సులుగా తీసుకోవాలనే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నిర్ణయంపై కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన నాటి నుండి నేటి వరకూ గత 13 సంవత్సరాలుగా శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఉద్యోగానికి కూడా నోచుకోని స్టాఫ్‌ నర్సులు వివిధ కాంట్రాక్ట్‌ల పద్ధతిలో దశాబ్ద కాలంగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాలు ఎప్పటికైనా క్రమబద్దీకరణ అవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో జీవో 115 జారీ చేయడంతో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందని కందిపప్పు : కర్నూలు జిల్లాలో 1,228 రేషన్‌ షాపులు ఉండగా వాటి పరిధిలో 6,76,209 రేషన్‌ కార్డులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 5,41,804 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటికి నెలనెలా బియ్యం, కందిపప్పు, పంచధార పంపిణీ జరుగుతోంది. కందిపప్పును మాత్రం రెండు నెలలుగా ఇవ్వడం లేదు. ఒక్కో కార్డుకు కిలో కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు కర్నూలు జిల్లాకు 676.209 మెట్రిక్‌ టన్నులు, నంద్యాల జిల్లాకు 541.804 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం ఉంది. జిల్లాలో కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. రెండు నెలలుగా పూర్తిగా నిలిపివేయడంతో పేదలు పప్పు నీళ్లకు కూడా దూరమయ్యారు.
అవీ..ఇవీ..అన్నీ..
విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రభుత్వమే సొంత గనులు కేటాయించాలని, విశాఖపట్నం ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త రస్తారోకో కార్యక్రమంలో భాగంగా జిల్లా వాప్తంగా పలు ప్రాంతాల్లో ఎఐటియుసి, సిఐటియు, ఎఐకెఎస్‌, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కర్నూలు నగరం మినహా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిమర్జన కార్యక్రమాలు నిర్వహించారు.

తాజా వార్తలు

➡️