శాంతి చర్చలతో అభివృద్ధి దిశగా వెళ్లాలి

Sep 1,2024 18:17

సదస్సులో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు

శాంతి చర్చలతో అభివృద్ధి దిశగా వెళ్లాలి
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు
– డబ్యుటిఎఫ్‌యు, సిఐటియు ఆధ్వర్యంలో శాంతి సదస్సు
ప్రజాశక్తి – నంద్యాల
ప్రపంచంలోని దేశాల మధ్య యుద్ధ వాతావరణం మంచిది కాదని, శాంతి చర్చలతో అభివృద్ధి దిశగా వెళ్లాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడిని ఆపాలని కోరుతూ ఆదివారం నంద్యాల పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు-డబ్ల్యుఎఫ్‌టియు ఆధ్వర్యంలో శాంతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఎ.నాగరాజు మాట్లాడుతూ యుద్దాల వల్ల ప్రజలకు, దేశాలకు చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దేశాల మధ్య ఐక్యత ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కానీ దానికి భిన్నంగా పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడికి పాల్పడడం దారుణమన్నారు. ప్రపంచమంతా శాంతిని నెలకొల్పేవిధంగా డబ్ల్యూఎఫ్‌టియు-సిఐటియు కోరుకుంటుందని అన్నారు. ఇటీవల రష్యా-ఉక్రేయిన్‌ల మధ్య జరిగిన యుద్ధం వల్ల చాలామంది చనిపోయారన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ఒక దేశంపై మరో దేశం పెత్తనం సరైనది కాదన్నారు. సామ్రాజ్యవాదం గెలవడం కోసం దేశాల మధ్యన చిచ్చుపెట్టి లబ్ధి పొందడం కోసం చేసే ప్రయత్నాలను ఆయా దేశాలు తిప్పి కొట్టాలని, శాంతి చర్చలతో ముగించాలని కోరారు. సెప్టెంబర్‌ 1న ప్రపంచశాంతి దినోత్సవం అన్ని దేశాలు జరుపుకుంటున్న తరుణంలో యుద్దాలను ఆపి ఒక కొలిక్కి తీసుకువచ్చి శాంతి చేకూర్చే మార్గంలో ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి కె.మహమ్మద్‌ గౌస్‌, జిల్లా కార్యదర్శి పి.వెంకట లింగం, ఏపి వెలుగు వివోఏ జిల్లా కార్యదర్శి తిరుపతయ్య, హమాలీ యూనియన్‌ నాయకులు గోపాల్‌, జైలాన్‌, వివిధ రంగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️