‘నామినేటెడ్‌’ ఎవరికో..?

Sep 29,2024 18:51

కార్టూన్‌

‘నామినేటెడ్‌’ ఎవరికో..?
– ఇప్పటికే సుబ్బారెడ్డికి పదవి
– రేసులో పలువురు ఆశావహులు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

నూతనంగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి ఇప్పటికే డోన్‌ నియోజకవర్గం నుంచి ధర్మవరం సుబ్బారెడ్డిని ఎపి సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి వరించింది. మరికొన్ని కార్పొరేషన్‌ ఛైర్మన్లను ప్రకటించాల్సి ఉండటంతో ఇంకా నామినేటెడ్‌ పదవులు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఆశావహులు భారీగానే ఉన్నారు. వారందరూ టిడిపి అదిష్టానంపై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి కూటమి మంచి విజయాన్నే సాధించింది. జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉండగా 11 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి, ఒక అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థి కూటమి తరపున గెలుపొందారు. రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు సమయంలో కొందరు అభ్యర్థులకు మొండి చేయి చూపి ఇతరులకు సీటును కేటాయించారు. వారికి ఏదో ఒక పదవి ఇస్తామంటూ బుజ్జగించారు. అలాంటి వారందరూ ప్రభుత్వంలో తమకు ఏదో ఒక నామినేటెడ్‌ పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఎపి సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మన్నె ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ధర్మవరం సుబ్బారెడ్డికి స్థానం దక్కింది. 2019లో టిడిపి ఓటమి పాలయిన తరువాత సుబ్బారెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆ తరువాత ప్యాపిలి మండలం జలదుర్గంలో జరిగిన బాదుడే బాదుడు సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డోన్‌ టిడిపి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించారు. తీరా ఎన్నికల సమయంలో ఆయనను కాదని డోన్‌ సీటును కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికి ఇచ్చారు. అప్పుడు తన సీటును వదులుకున్నందుకు సుబ్బారెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సుబ్బారెడ్డికి సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు.
ఇంకా కొన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్‌ పదవులను ప్రకటించాల్సి ఉండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. టిడిపి ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీపై దృష్టి సారించడంతో ఎవరికి వారు తమ తమ స్థాయిలో జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారిలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఆదోని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జీ మీనాక్షి నాయుడు, కోడుమూరు నియోకవర్గ సమన్వయకర్త విష్ణువర్ధన్‌ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ మాజీ ఇంఛార్జీ భూమా బ్రహ్మానంద రెడ్డి, మైనార్టీ నాయకులు వాహిద్‌ హుస్సేన్‌ ఉన్నారు. రెండు సార్లు మంత్రాలయం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయి 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అనుకున్న పాలకుర్తి తిక్కారెడ్డి ఆయన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. రాఘవేంద్రరెడ్డికి టిడిపి టికెట్‌ ఇచ్చారు. తిక్కారెడ్డికి టిడిపి జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించారు. అధికారంలోకి వస్తే సమున్నత పదవి ఇస్తామని అదిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం నామినేటెడ్‌ పదవుల భరీలో ఉన్నారు. పదవులు ఆశిస్తున్న వారిలో డోన్‌ నియోజకవర్గ మాజీ ఇంఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. 2019లో టిడిపి ఓటమి పాలయిన తరువాత సుబ్బారెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆ తరువాత ప్యాపిలి మండలం జలదుర్గంలో జరిగిన బాదుడే బాదుడు సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డోన్‌ టిడిపి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించారు. తీరా ఎన్నికల సమయంలో ఆయనను కాదని డోన్‌ సీటును కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు సుబ్బారెడ్డికి నామినేటెడ్‌ పదవి ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నంద్యాల టికెట్‌ ఆశించిన భూమా బ్రహ్మానందరెడ్డి, వాహిద్‌ హుస్సేన్‌లకు మొండిచేయి చూపి ఆ టికెట్‌ను ఎన్‌ఎండి ఫరూక్‌కు ఇచ్చారు. ఆ సమయంలో వారికి న్యాయం చేస్తామని అదిష్టానం హామీ ఇచ్చింది. ఫరూక్‌ గెలుపుకు కృషి చేసిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చేందుకు టిడిపి అదిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసిన కోట్ల సుజాతమ్మ, మాజీ మంత్రి కెఇ ప్రభాకర్‌, రాష్ట్ర గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా పని చేసిన నాగేశ్వర్‌ యాదవ్‌తో పలువురు జనసేన, బిజెపి నేతలు కూడా నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

➡️