జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎస్.మంజులవాణి
పిఆర్-1 యాప్‌తో పంచాయతీల పర్యవేక్షణ
జిల్లాలో పారిశుధ్యం పైన ప్రత్యేక దృష్టి
సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో సంపద సృష్టి
– ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 7993812160
పరిశుభ్రతపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు
ప్రజాశక్తితో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎస్.మంజులవాణి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
‘గ్రామ పంచాయితీల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ఇక నుండి పిఆర్-1 యాప్‌తో ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది ప్రతి పనిపై ఈ యాప్ ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. గత నెలలో ఈ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులు, గ్రామాల్లో మురికి కాలువల పరిశుభ్రత, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్‌ల శుభ్రత, క్లోరినేషన్, తాగునీటి సమస్యలను ఆన్‌లైన్ ద్వారానే పర్యవేక్షించవచ్చు. ప్రజలు గ్రామాల్లో సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 7993812160కు ఫిర్యాదు చేయవచ్చు’ అనిజిల్లా గ్రామ పంచాయితీ అధికారి ఎస్. మంజుల వాణి తెలిపారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, అంటువ్యాధులు, ఇతర కార్యక్రమాలపై డిపిఒ ప్రజాశక్తితో ముఖాముఖి మాట్లాడారు. ఆమె మాటల్లోనే..
జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి…? ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. వివరించగలరు.?
డిపిఒ : నంద్యాల జిల్లాలో 489 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 409 మంది గ్రామ కార్యదర్శులు, 488 మంది సర్పంచులు, 4865 వార్డ్ సభ్యులు ఉన్నారు.
క్లస్టర్ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి..? గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎంత ఉంది..?
డిపిఒ : క్లస్టర్ పంచాయితీలు 292 ఉన్నాయి. 489 గ్రామ పంచాయితీల్లో 13 లక్షల 26 వేల 031 మంది జనాభా ఉన్నారు.
గ్రామాల్లో సంపద సృష్టికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
డిపిఒ : జిల్లాలోని గ్రామాల్లో సంపద సృష్టికి చేపట్టిన చర్యల్లో భాగంగా సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లు 325 పూర్తి అయ్యాయి. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వాటిని అమలులోకి తెచ్చి చెత్త ద్వారా సంపద సృష్టికి చర్యలు తీసుకుంటున్నాం.
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు ఎలా జరుగుతున్నాయి..?
డిపిఒ : జిల్లాలోని గ్రామాల్లో పారిశుధ్య పనులపై నిరంతరం దృష్టి సారించి పర్యవేక్షిస్తున్నాం. శానిటేషన్ సిబ్బంది గ్రామాల్లో చెత్త లేకుండా పరి శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
గ్రామాల్లో వ్యాధులు ప్రభలకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు..?
డిపిఒ : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో రక్షిత తాగునీటి పథకాలను క్రమం తప్పకుండా15 రోజులకు ఒకసారి శుభ్రం చేయిస్తున్నాం. ట్యాంకులు నింపిన ప్రతిసారి క్లోరినేషన్ చేయిస్తున్నాం. జిల్లాలోని 489 గ్రామ పంచాయతీలలో ట్యాంకులను శుభ్రపరచిన తేదీలను నమోదు చేయించి సంబందిత విస్తరణాధికారి నుండి ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు. గ్రామాల్లో తాగునీటి పైపులైన్‌లు లీకేజీలు లేకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నాం. పైపులైన్లు మురుగు కాలువల దగ్గర వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుంటల్లో నీరు నిల్వ ఉండకుండా అరికట్టి దోమలు వృద్ధి కాకుండా వేస్ట్ ఆయిల్ చల్లిస్తున్నాం. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నిత్యం చర్యలు తీసుకుంటున్నాం.
రోడ్లు, కాలువల పరిశుభ్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
డిపిఒ : గ్రామాల్లో సైడు కాలువలను పరిశుభ్రంగా వుంచడంతో పాటు కాలువలలో క్రిమి సంహారక మందులు క్రమ పద్ధతిలో పిచికారి చేయిస్తున్నాం. నిల్వ ఉన్న నీటి కుంటలలో వేస్టేజ్ ఆయిల్ బాల్స్, కిరోసిన్ క్రమపద్ధతిలో పిచికారి చేయిస్తున్నాం. ప్రతి వారం గ్రామంలో ఫాగింగ్ చేయిస్తున్నాం. చెరువులలో, మురుగు గుంటలలో దోమల నివారణకు గంబూషియా రకం చేపలను వదులుతున్నాం. చెత్తకుండీలలో గల చెత్తను గ్రామానికి వెలుపల గల డపింగ్ యార్డుకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నాం. సైడు కాల్వలు, చెత్తకుండీలు, పశువుల తాగునీటి తొట్టెలు గల ప్రదేశాలలో దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు ప్రజలు శుభ్రపరచుకుంటూ సహకరించాలి.
గ్రామాల్లో నివాస ప్రాంతాల్లో పందులు, కుక్కలు ఉండకుండా తీసుకుంటున్న చర్యలు వివరించగలరు..?
డిపిఒ : పందులను నివాస ప్రాంతాలకు 5 కిలోమీటర్ల దూరంలో వదులుకోవాలని పందుల పెంపకందారులకు నోటీసులు జారీ చేసాం. పందులను, వీధి కుక్కలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
పారిశుధ్యంపై ప్రజల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు..?
డిపిఒ : గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సురక్షిత తాగునీరు వినియోగించడం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, కలుషితమైన నీరు తాగడం వలన వచ్చు వాధ్యులు, దోమ తెరలను ఉపయోగించడం తదితర వాటి ప్రాముఖ్యత అర్ధమయ్యేలా కరపత్రాల ద్వారా, దినపత్రికల ద్వారా, దండోరా ద్వారా వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నీటిని కాచి చల్లార్చిన తర్వాత తాగాలి.