ఉద్యోగ భద్రత కరువు

Sep 22,2024 20:22

ట్రాన్స్‌పార్మర్లకు మరమ్మతులు చేస్తున్న కార్మికులు

ఉద్యోగ భద్రత కరువు
– అందని ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలు
– విద్యుత్‌ శాఖలో ఎస్‌పిఎం కార్మికుల అవస్థలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/కార్పొరేషన్‌
విద్యుత్‌ శాఖలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు పనులు చేసే ఎస్‌పిఎం కార్మికుల జీవితాలు భద్రత లేని ఉద్యోగాలతో సాగుతున్నాయి. కార్మికులకు అందాల్సిన ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలూ అందడం లేదు. వారికి బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. దీంతో వివిధ సందర్భాల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు…
విద్యుత్‌ శాఖలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో 12 ఎస్‌పిఎం (స్పెషల్‌ ప్రొవెక్టింగ్‌ మెయింటెనెన్స్‌) షెడ్లు (వర్క్‌షాప్‌లు) ఉన్నాయి. వాటిలో ఒక్కో షెడ్‌కు 13 మంది చొప్పున 156 మంది కార్మికులు పని చేయాలి. కానీ అరకొరగా కార్మికులను పెట్టుకుని పనులు చేయించుకుంటున్నారు. 12 షెడ్లలో కలిపి మొత్తం 65 మంది మాత్రమే పని చేస్తున్నారు. కర్నూలు పట్టణంలోని షెడ్డులో ఆరుగురు, డోన్‌లో ఏడుగురు, కర్నూలు రూరల్‌ షెడ్‌లో ఆరుగురు, ఆదోనిలో ఏడుగురు, పత్తికొండలో ఐదుగురు, నందికొట్కూరులో ఆరుగురు, బనగానపల్లెలో ఆరుగురు, నంద్యాల పట్టణంలో ముగ్గురు, నంద్యాల రూరల్‌ షెడ్‌లో ఆరుగురు, ఆళ్లగడ్డలో ఆరుగురు, కోవెలకుంట్లలో ఆరుగురు, ఎమ్మిగనూరులో ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, వైండింగ్‌ పనులు, కాయిల్‌ మరమ్మతులు, ఆయిల్‌ మార్పిడి వంటి పనులు ఎస్‌పిఎం కార్మికులు చేస్తున్నారు. 8 రకాల త్రీ ఫేస్‌, 3 రకాల సింగిల్‌ ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు పనులు చేస్తారు. అక్కడ పని చేసే వారంతా హైస్కిల్డ్‌ కార్మికులే. హైస్కిల్డ్‌ కార్మికులకు కాంట్రాక్టు కార్మిక చట్టం ప్రకారం నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలి. ఎస్‌పిఎం కార్మికులందరూ వివిధ కాంట్రాక్టర్ల కింద పని చేస్తున్నారు. ఏ ఒక్క కాంట్రాక్టరు కూడా కనీస వేతనాన్ని చెల్లించడం లేదు. రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకూ మాత్రమే నెలవారీ వేతనం చెల్లిస్తున్నారు. అందులో కూడా పనికి రాని రోజుల్లో వేతనాన్ని కోత విధిస్తున్నారు. కార్మికులు కల్పించాల్సిన ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలను కూడా కల్పించడం లేదు. బీమా సౌకర్యం లేదు. ఉద్యోగ భద్రత కూడా కరువైంది. రెండు సంవత్సరాల క్రితం వేతనం పెంచగా అప్పటి నుంచి మళ్లీ పెంచలేదు. రోజు రోజుకూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక పక్క కుటుంబ భారాలు, మరో పక్క పిల్లల చదువులు, స్కూల్‌ ఫీజులు, వయోవృద్ధులైన తల్లిదండ్రుల వైద్య ఖర్చులతో చాలీచాలని జీవితాలతో కార్మికులు బతుకీడుస్తున్నారు. అప్పులు చేసి వడ్డీ కట్టలేక సతమతమౌతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలు సార్లు ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని విద్యుత్‌ శాఖలో ఎస్‌పిఎం కార్మికులు కోరుతున్నారు.
పనికి తగిన వేతనం ఇవ్వాలి
30 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పనికి తగిన వేతనం చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇఎస్‌ఐ, పిఎఫ్‌, బీమా సౌకర్యాలు కల్పించాలి.
– జె.శ్రీనివాసులు, ఎస్‌పిఎం కార్మికుడు, కర్నూలు.

➡️