ఘనంగా గణేష్‌ నిమజ్జనం

Sep 9,2024 21:02

ఆత్మకూరు పట్టణంలో ర్యాలీగా వస్తున్న గణేష్‌ విగ్రహాలు

ఘనంగా గణేష్‌ నిమజ్జనం
– పాములపాడులో నిమజ్జం కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా ఎస్‌పి అధిరాజ్‌ సింగ్‌ రాణా
– ఆళ్లగడ్డలో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
– తెలుగు గంగ కాల్వలో బాలుడు గల్లంతు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు పూజలందుకున్న వినాయక విగ్రహాలను సోమవారం వైభవంగా నిమజ్జనం చేశారు. జిల్లాలోని ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నందికొట్కూరు, పగిడ్యాల, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, కోవెలకుంట్ల, సంజామల, రుద్రవరం, అవుకు, చాగలమర్రి, బనగానపల్లె, ఆళ్లగడ్డ మండలాల్లో కొలువుదీరిన గణనాధులకు మూడు రోజులపాటు పూజలు నిర్వహించి సోమవారం ఘనంగా నిమజ్జనం చేశారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గణేష్‌ నిమజ్జనం ఊరేగింపును ప్రారంభించారు. పాములపాడులో గణేష్‌ నిమజ్జనం ప్రాంతాన్ని జిల్లా ఎస్‌పి అధిరాజ్‌ సింగ్‌ రాణా పరిశీలించారు. ఆళ్లగ్డలో మండపం వద్ద ఆదివారం రాత్రి డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. తెలుగ గంగ కాల్వలో నిమజ్జనం సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో పడి కొట్టుకుపోయాడు.
ప్రజాశక్తి – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో వినాయక విగ్రహాలను భారీ మేళ తాళాలతో పట్టణంలో ఊరేగింపుగా బయలుదేరి పాములపాడు మండలం ఎర్రగుడూరు తెలుగు గంగ కాల్వలో నిమజ్జనం చేశారు. అంతకుముందు పట్టనంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయం వద్ద ఉన్న వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి పూజలు నిర్వహించి నిమజ్జన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎస్‌పి రామంజి నాయక్‌. సీఐ ఓబులేష్‌, నంద్యాల టూ టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌, ఎస్‌ఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. పాములపాడు : మండలంలోని ఎర్రగుడూరు గ్రామం సమీపంలో ఉన్న తెలుగుగంగ కాల్వలో దాదాపుగా 40 గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా గణేష్‌ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని డీఎస్పీకి సూచించారు. తహసీల్దార్‌ సుభద్రమ్మ, ఎంపిడిఓ గోపికృష్ణ, ఎస్‌ఐ సురేష్‌ నిమజ్జన కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ పట్టణంలోని ఆశ్రమం వీథిలోని గంగమ్మ దేవాలయం వద్ద గణేష్‌ మండపం వద్ద ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అశోక్‌ (32) డాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాలు బాష (12)తో పాటు మరో ముగ్గురు పిల్లలు కలిసి వినాయకుని నిమజ్జనం వెంట వెళ్లారు. నిమజ్జనం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నలుగురు పిల్లలు తెలుగు గంగ ప్రాజెక్టు నీటిలో పడ్డారు. అహోబిలం టోల్‌గేట్‌ సిబ్బంది వెంటనే నీటిలో కొట్టుకుపోతున్న ముగ్గురు పిల్లలను రక్షించగా, లాలు బాషా మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్సై హరి ప్రసాద్‌, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

➡️