భూ సమస్యల పరిష్కారానికే గ్రామసభలు

Oct 22,2024 19:23

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌

భూ సమస్యల పరిష్కారానికే గ్రామసభలు
– జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌
ప్రజాశక్తి – గోస్పాడు
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ పేర్కొన్నారు. మంగళవారం గోస్పాడు మండలం జిల్లెల్ల సచివాలయంలో గ్రామసభను నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకే ఈ గ్రామ సభలు జరుపుతున్నామని తెలిపారు. రైతులు భూ సమస్యలు తమ దృష్టికి తెస్తే 15 రోజుల్లో పరిష్కారం చూపుతామని చెప్పారు. భూ విస్తీర్ణాలు ఎక్కువ, తక్కువలు ఉన్నా వాటిని సరిదిద్దుతామని, అందుకు రైతులు కూడా సహకరించాలని సూచించారు. పేర్లలో తప్పులు ఉన్నా సరి చేసుకోవచ్చన్నారు. తహశీల్దార్‌ షేక్‌ మొహిద్దీన్‌ మాట్లాడుతూ రీ సర్వే ద్వారా జరిగిన తప్పులను సరి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని రీ సర్వే జరిగిన 9 గ్రామాలలో 23న కానాలపల్లి, 24న చింతకుంట్ల, 25న క్రిష్ణాపురం, 26న పసురుపాడు, 29న రాయపాడు, 30న నాగులవరం, నవంబరు 1న సాంబవరం, 2న తేలపురిలో గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన గ్రామాలలో కొత్తగా రీ సర్వే చేపడతామని, అందుకు రెవెన్యూ సిబ్బంది మండల ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఎవరైనా అందుబాటులో లేనిపక్షంలో ఈ నెల 30వ తేదీ వరకు తహశీల్దార్‌ కార్యాలయంలో అర్జీలను ఇవ్వచ్చని అన్నారు. అనంతరం వివిధ సమస్యలపై రైతుల నుంచి జెసి, అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మల్లికార్జున, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పివి జయరాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️