రైతుల రుణాలు రద్దు చేయాలి

Sep 29,2024 18:53

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం నాయకులు

రైతుల రుణాలు రద్దు చేయాలి
– మెట్ట భూములకు ఎత్తిపోతల ద్వారా సాగు నీరివ్వాలి
– రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
జిల్లాలో కరువు పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి వలన దెబ్బతిన్న రైతన్నల రుణాలను రద్దు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్‌ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్‌, జిల్లా నాయకులు ఏ.సురేష్‌, శ్రీనివాస రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, నాగరత్నం, రాజు తదితరులు జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారిని ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎ.రాజశేఖర్‌ మాట్లాడారు. నంద్యాల జిల్లాలో గత సంవత్సరం తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, సకాలంలో వర్షాలు రాక అతివృష్టి, అనావృష్టితో మొక్కజొన్న, మినుము, మిరప, పండ్ల తోటలు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారని చెప్పారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారని అన్నారు. ఇప్పటికే జిల్లాలో తహశీల్దార్‌ కార్యాలయాల ముందు రైతన్నల సమస్యలపై రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టామన్నారు. 2023 ఖరీఫ్‌లో 6 మండలాలను కరువుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, కేంద్ర కరువు బృందం జిల్లాలో పర్యటించినప్పటికీ ఇప్పటి వరకు కరువు నివారణ చర్యలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించలేదన్నారు. 2023 ఖరీఫ్‌, రబీలో సాగు చేసిన పంటలకు ఇన్సూరెన్స్‌ ప్రకటించి రైతుల ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు వెంటనే అమలు చేసి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇవ్వాలని కోరారు. ఎత్తిపోతల ద్వారా సాగునీరివ్వాలిజిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా మెట్ట భూములకు సాగు నీరు ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో నిర్మించి ఇతర జిల్లాలకు, మద్రాసు నగరానికి తాగునీరు అందిస్తున్నప్పటికీ ఈ జిల్లాలో రైతులు సాగునీటి వనరులు లేక ప్రతి సంవత్సరం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సిద్దాపురం చెరువుపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి శ్రీపతిరావుపేట, ఇందిరేశ్వరం, వడ్ల రామాపురం, కురుకుంద, కొత్తపల్లె చెరువులకు నీళ్లు నింపాలన్నారు. సంగమేశ్వరం, జడ్డువారిపల్లె దగ్గర శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌పై ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి కొత్తపల్లి మండలంలోని మెట్ట భూములన్నిటికీ సాగు నీరు ఇవ్వాలన్నారు. బేతంచెర్ల మండలం గూటుల్లె చెరువును రిజర్వాయర్‌గా మార్చి హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపడం ద్వారా ఎనిమిది గ్రామాలకు సాగు, తాగు నీరు పుష్కలంగా ఉంటుందని కలెక్టర్‌కు వివరించారు. పాములపాడు మండలంలో ఎస్‌ఆర్‌ఎంసిపై జూటూరు-పాములపాడు దగ్గర ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి పాములపాడు, రుద్రవరం, జూటూరు, మిట్టకందాల గ్రామాల మెట్ట భూములకు సాగు నీరు ఇవ్వాలన్నారు. వెలుగోడు రిజర్వాయర్‌పై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి వన్‌ ఆర్‌, వన్‌ ఎల్‌ తూములతో పాటు వెలుగోడు, గుంతకందాల, వేంపెంట, బానకచర్ల గ్రామాల మెట్టు భూములకు సాగునీరు ఇచ్చి రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధి కల్పించాలని కోరారు. రైతులు పోరాటాల ద్వారా సాధించుకున్న వ్యవసాయానికి ఉచిత కరెంటును కొనసాగించాలని, జీవో 22ను రద్దు చేయాలన్నారు.తుఫాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలన్నిటికీ ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు. అన్ని రకాల విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, రసాయన ఎరువులు సబ్సిడీపై అందించాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన చిన్న, సన్నకారు రైతులందరికీ నెలకు రూ. 10 వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కౌలు రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నిర్మిస్తున్న హైవే రోడ్డు, సోలార్‌ ప్రాజెక్టులలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్ట ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మార్కెట్‌ ధర పై 4 రెట్లు అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని, తద్వారా నంద్యాల జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ను కోరారు.

తాజా వార్తలు

➡️