సమాన పనికి సమాన వేతనమివ్వాలి

Sep 30,2024 20:28

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు

సమాన పనికి సమాన వేతనమివ్వాలి
– స్కీమ్‌ వర్కర్ల అక్రమ తొలగింపులు ఆపాలి : సిఐటియు
– కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, టైం స్కేల్‌, డైలీ వేజెస్‌ కార్మికులు ధర్నా
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
వివిధ ప్రభుత్వ శాఖల పథకాల్లో, సంస్థల్లో పని చేసే ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, టైం స్కేల్‌, డైలీ వేజెస్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాలలోని నూనెపల్లె ప్లై ఓవర్‌ బ్రిడ్జి నుండి జిల్లా కలెక్టరేట్‌ వరకు ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, టైం స్కేల్‌, డైలీ వేజెస్‌ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కేఎండి గౌస్‌ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను తొలగించే పద్ధతి పెట్టుకుందని, ఈ విధానానికి వెంటనే స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలు పెంచాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య బీమా వర్తింపజేయాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్లు మారినా కార్మికులను కొనసాగించాలని, చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌, సెలవులు ఇవ్వాలని, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి.బాల వెంకట్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు కృష్ణయ్య, రామకృష్ణ, ఆర్‌ఏఆర్‌ఎస్‌ యూనియన్‌ నాయకులు పుల్లయ్య, అయ్యన్న, శివమ్మ, సుజాత, కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, డైలీ వేజెస్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️