ఎల్లావత్తుల బీరవోలు చెరువు ఆక్రమణ

Sep 15,2024 21:51

ఆక్రమణలతో చెరువు విస్తీర్ణం తగ్గి అడుగంటిన నీళ్లు, నీళ్లు అందక పగుళ్లు ఇచ్చిన వరి పొలం

ఎల్లావత్తుల బీరవోలు చెరువు ఆక్రమణ
– 70 ఎకరాల విస్తీర్ణంకు గాను 10 ఎకరాలే మిగిలిన వైనం
– పక్కనే తెలుగు గంగ ప్రవహిస్తున్నా చెరువులోకి చేరని నీళ్లు
– వర్షపు నీటి ఆధారంగానే వరి పంట సాగు
– అప్పుడే అడుగంటిన నీళ్లు
– 200 ఎకరాల్లో ఎండుతున్న పైరు
– ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి – రుద్రవరం
రుద్రవరం మండలంలోని ఎల్తావత్తుల బీరవోలు చెరువు విస్తీర్ణం ఆక్రమణకు గురయింది. దాదాపు 90 శాతం ఆక్రమణకు గురి కావడంతో నీటి నిల్వ సామార్థ్యం పూర్తిగా పడిపోయింది. చెరువు పక్కనే తెలుగంగ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు పుష్కలంగా పారుతుంది. అయితే ఎల్లావత్తుల బీరవోలు చెరువుకు తెలుగంగ ప్రధాన కాలువ నుండి ఉప కాల్వను అనుసంధానం చేయకపోవడంతో చెరువులోకి నీరు చేరడం లేదు. కేవలం వర్షాల వలన చెరువులోకి చేరిన నీటి ఆధారంగా సాగు చేసిన దాదాపు 200 ఎకరాల్లో వరి పంటకు ప్రస్తుతం సాగునీరు అందక ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రుద్రవరం మండలంలో ఎల్లావత్తుల బీరవోలు చెరువును పూర్వపు పెద్దలు దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. చెరువు కింద దాదాపు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈ చెరువును ప్రతి ఏటా కొందరు ఆక్రమించుకుంటూ వచ్చారు. దాదాపు 60 ఎకరాలకు పైగా చెరువును ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే చెరువు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు చేరింది. ఈ నీటిని ఆధారంగా చేసుకుని ఎల్లవత్తుల, బీరవోలు గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 200 ఎకరాలపైగా వరి పంటను సాగు చేశారు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులోని నీరంతా వరి పంటకు 20 రోజులకు మాత్రమే సరిపోయింది. పంట రావాలంటే ఇంకా దాదాపు 80 రోజుల సమయం ఉంది. వరి పంట ప్రతి పది రోజులకోసారి నీటి తడిని అందించాలి. అప్పుడే వరి పంట దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వరి నాట్లు వేసిన 20 రోజులకే చెరువులో ఉన్న నీరు అంతా అయిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పంటకు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ చెరువుకు తెలుగంగ 16వ బ్లాక్‌ ఛానల్‌ ద్వారా నీరు అందాల్సి ఉంది. అయితే మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు చెరువును తెలుగు గంగ కాలువకు అనుసంధానం చేయకపోవడంతో చెరువులోకి నీరు చేరడం లేదు. ఎండిపోతున్న వరి పంటకు సాగునీరు అందక రైతులు పంటను కాపాడుకోవడానికి చెరువులో ఉన్న కాస్త నీటి కోసం రాత్రింబవళ్లు జాగారం చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు చెరువుకు తెలుగంగ కాలువను అనుసంధానం చేసి నీరు అందేలా చూడాలని, తమ పంటలను కాపాడాలని రెండు గ్రామాల రైతులు కోరుతున్నారు.

కోటి ఆశలతో వరి పంట సాగు చేశా- రైతు నాగేశ్వరరావు, ఎల్లా వత్తుల గ్రామం.

కోటి ఆశలతో 15 ఎకరాల్లో చెరువు కింద వరి పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 20 వేలు చొప్పున లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశాను. అయితే చెరువులో ఉన్న నీరంతా అయిపోవడంతో ఇప్పుడు సాగునీరు అందడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు చెరువుకు నీరు అందేలా చూడాలి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే వర్షాలు లేవు. చెరువులో ఉన్న నీరు అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తెలుగు గంగ కాలువ ద్వారా చెరువును నింపాలి.

అప్పులు చేసి వరి పంట సాగు చేశా- మహిళా రైతు లాల్‌బీ, ఎల్లావత్తుల గ్రామం.

అప్పులు చేసి వరి పంట సాగు చేశాను. నా భర్త చనిపోయాడు. కూలీ నాలి చేసుకొని ఉన్న ఎకరన్నర పొలంలో వరి పంట సాగు చేస్తే నీరు లేక పంట ఎండిపోతోంది. చెరువులో అరకొరగా నీరు ఉంది. ఈ నీటిని పంటకు పెట్టుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. అయినా చుక్క నీరు పొలంలోకి రావడం లేదు. అధికారులు కష్టాన్ని గుర్తించి తెలుగు గంగ కాలువ ద్వారా చెరువుకు నీరు నింపాలి.

➡️