బకాయి వేతనాలు చెల్లించాలి

Sep 9,2024 21:03

ధర్నా చేస్తున్న విఒఎలు

బకాయి వేతనాలు చెల్లించాలి
– విఒఎల అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలి
– ఎపి వెలుగు విఒఎల సంఘం, సిఐటియు డిమాండ్‌
– కలెక్టరేట్‌ ఎదుట విఒఎలు ధర్నా
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ఎపి వెలుగు విఒఎలకు 6 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని సిఐటియు, ఎపి వెలుగు విఎఏ (యానిమేటర్ల)ల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఎపి వెలుగు విఒఎల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌ ముందు అక్రమ తొలగింపులు, వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి వివోఏల సంఘం జిల్లా అధ్యక్షులు కె.సోమన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, జిల్లా కార్యదర్శి వి.బాల వెంకట్‌లు పాల్గొని మాట్లాడారు. వివోఏలకు బకాయిలు వేతనాలను చెల్లించాలని అనేక పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివోలను అక్రమ తొలగింపులకు, వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. వందలాదిమంది వివోఏలను తొలగించ డానికి లిస్టు తయారు చేసి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి అక్రమ తొలగింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ గ్రామ సమైక్య జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించకుండా ఏ ఒక్క వివోఏను తొలగించ కూడదని, గ్రామ సంఘం తీర్మానం ద్వారానే పనులు జరగాలని పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో వివోఏల సంఘం జిల్లా నాయకులు వెంకటరమణ, శంకరయ్య, పుల్లయ్య, మునిస్వామి, శ్రీనివాసులు, వివోఏలు పాల్గొన్నారు.

➡️