అతిసార బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న కలెక్టర్, ఎమ్మెల్యే
ప్రజలు ఆందోళన చెందవద్దు..
– అదుపులోనే అతిసార
– మీడియా వాస్తవాలు చెప్పాలి
– ఆళ్లగడ్డలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
అతిసార పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎవరూ అధైర్య పడవద్దని, తాము అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భరోసానిచ్చారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి ప్రబలిన అభ్యుదయ కాలనీ, సద్దాం కాలనీల్లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా వారు బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైమరీ అర్బన్ హెల్త్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న అతిసార బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్, ఎమ్మెల్యేలు తెలిపారు.వార్డులో అతిసార బాధితులు, గర్భిణులను కలిసి ఓకే చోట ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గర్భిణులకు ఇతర వార్డుకు తరలించాలని ఆదేశించడంతో వైద్య సిబ్బంది వారిని తరలించారు. ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని ఉంచడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని కాలనీలలో తిరిగామని, తాను శుక్రవారం రాత్రి కూడా ఆ ప్రదేశాలను స్వయంగా చూసి పరిశీలించినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం రోజున ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రజలు వీరేచనాల బారిన పడ్డారని తెలిపారు. శాంపిల్స్ పరీక్షల్లో నీటి కలుషితం లేన్నట్లు వచ్చిందన్నారు. అతిసార పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ అతిసారతో ముగ్గురు మరణించారని, వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని కొన్ని మీడియాలలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా కథనాలు ప్రచురించారని, వాస్తవాలు రాయాలన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మీడియా పని చేయాలన్నారు. ఉన్నది ఉన్నట్లుగా రాయాలన్నారు. శనివారం నాటికి 11 మంది అతిసారతో బాధపడుతున్నారని, మృతి చెందిన ముగ్గురు అతిసారతో కాదని, దీర్ఘకాలిక వ్యాధులతో అని తెలిపారు. అన్ని వీధులలో శానిటరీ బ్లీచింగ్ చేయించామన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇంటింటికి కరపత్రాల ద్వారా, ఆటోలలో మైకుల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేశామని చెప్పారు. పట్టణంలో రెండు రోజులపాటు చికెన్ షాపులు బంద్ చేయించామని తెలిపారు. అలాగే పట్టణంలో 200 నీటి శాంపిల్స్ తీసుకున్నామని, అతిసార వ్యాధిపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ, ఆర్‌డిఒ మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ వైద్యులు, ఎంపిహెచ్‌ఓ దస్తగిరి రెడ్డి, ఏఈ సురేంద్ర రెడ్డి, శానిటరీ అధికారి బాలస్వామి, తాహసిల్దార్ రత్నకుమారి, కౌన్సిలర్ హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.