ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా..?

Sep 9,2024 16:07

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా..?

100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను అధిగమించండి..
జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ఉపాధి హామీ పనుల లేబర్‌ బడ్జెట్‌, ఇళ్ల నిర్మాణాల పురోగతి, పంట నష్ట నమోదు, ఈ క్రాప్‌ బుకింగ్‌, ఓడిఎఫ్‌ ప్లస్‌ సర్వే తదితర అంశాలలో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్రస్థాయి అధికారులు పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించే తప్ప పనులు చేయరా అని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతిపై లక్ష్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లా ప్రగతి లక్ష్యసాధనలో అప్పగించిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ధోరణి కనిపిస్తోందని… ఏ ఒక్క అధికారికి నేను ముందుండాలి అనేది ఉండదా..? అని కలెక్టర్‌ ప్రశ్నిస్తూ మనసు.. వాక్కు ఏకమై పని చేయాలని అధికారులను ఆదేశించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ పనులకు కేటాయించిన లేబర్‌ బడ్జెట్‌ ఆత్మకూరు క్లస్టర్‌ పరిధిలోని అన్ని మండలాలలో తక్కువగా ఉందని… పనితీరు మెరుగుపరచుకొని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల తదితర మండలాలలో ఉపాధి హామీ కింద 1,100 ఎకరాలలో చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌ కింద మొక్కల పెంపకానికి సంబంధించి పిట్టింగ్‌, కంచే ఏర్పాటు… ప్రతిదానికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇచ్చినా పనులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్‌ ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణంలో ఉన్నప్పుడు 90 రోజుల పని దినాలకు సంబంధించి పొజిషన్‌ సర్టిఫికెట్‌ అడగాల్సిన అవసరం లేదని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేయాలని పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈని ఆదేశించారు.
నిర్మాణాల్లో పురోగతి పెంచండి .. ఇళ్ల నిర్మాణ ప్రగతికి సంబంధించి ప్రతి మండలంలో రోజుకు రెండు ఇళ్ళు పూర్తి స్థాయి, పది ఇళ్ళు స్టేజ్‌ కన్వర్షన్‌ కు తీసుకురావాలని ఆదేశించినప్పటికీ అత్యల్ప ప్రగతి చూపుతున్నారన్నారు. వందరోజుల ప్రణాళికలో 3,413 గహాలు పూర్తి చేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 608 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారన్నారు. కొత్తపల్లి, నందికొట్కూరు, పగిడ్యాల, బేతంచెర్ల, ప్యాపిలి తదితర మండలాలలో తక్కువ ప్రగతి కనిపిస్తోందని ఈ వారం చేస్తామని ప్రతిసారి చెప్పడం సరికాదని కలెక్టర్‌ తెలిపారు.
రైతన్నకు అండగా ఉండండి ..అన్నం పెట్టే రైతుకు సపోర్ట్‌ ఇచ్చేందుకు పంట నష్ట వివరాలను మంగళవారం ఉదయంలోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ వ్యవసాయ రంగ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. 4.6 లక్షల ఎకరాలకు సంబంధించి 1.2 లక్షల రైతుల ఈ కేవైసి సంబంధించి కేవలం 41 వేల మందికి మాత్రమే పూర్తి చేశారని ఇంకా 1.10 లక్షల మంది రైతుల ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని ఇందుకు సంబంధించి గ్రామ వ్యవసాయ అధికారులు, వీఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గోస్పాడు, బనగానపల్లి, శిరివెళ్ల, బండి ఆత్మకూరు తదితర మండలాలలో తక్కువ ప్రగతి ఉందని పంట నష్ట నమోదు, ఈక్రాప్‌ బుకింగ్‌ ఏకకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద పెండింగ్‌ లో వున్న దరఖాస్తులు పరిశీలించి వాస్తవ నివేదికలను వెంటనే పంపాలని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. డేటా బేస్‌ ప్రకారం పల్స్‌, ఓడిఎఫ్‌ ప్లస్‌ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు.
హాస్టళ్ల లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
51 సంక్షేమ వసతి గహాల్లో తనిఖీల నిమిత్తం స్పెషల్‌ అధికారులను నియమించామని సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా హాస్టల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో ఉన్న వసతులను క్రమ పద్ధతిగా వినియోగించుకుంటూ వసతి గహాలను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

➡️