వర్షానికి పంట నేలవాలి కుళ్లిపోతున్న మొక్కజొన్న కంకులు
కళ్లెదుటే కుళ్లిపోతున్న ‘మొక్కజొన్న’
– జోరు వర్షాలతో నేల వాలిన పంట
– 5 వేల ఎకరాల్లో కోత కోయని రైతులు
– మరోపక్క కల్లాల్లో తడిసి రంగు మారుతున్న ధాన్యం
– నాలుగు నెలల అన్నదాత కష్టం వర్షార్పణం
ప్రజాశక్తి – కొత్తపల్లి
‘పంట పొలాల్లో కళ్లెదుటే మొక్కజొన్న కంకులు కుళ్లిపోతున్నాయి. పంట కోద్దామంటే వీలు కాని పరిస్థితి ఉంది. గత వారం కురిసిన భారీ వర్షాల వలన మొక్కజొన్న పంట మొత్తం పొలాల్లో నేల వాలిపోయింది. ఎడ తెరపి లేని వర్షాలతో పొలంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు పొలంలో గడ్డి, పిచ్చి మొక్కలు మెలిచి ఏపుగా పెరగడంతో మొక్కజొన్న పంటను కూలీలతో కోత కోయించేందుకు వీలు పడడం లేదు. కంకులను వెతకులాటడడంతోనే సమయమంతా పోతుంది. నాలుగు నెలల కష్టం వారం రోజుల్లో కురిసిన వర్షాలకు మొత్తం నీటి పాలయింది. మరోపక్క కోత కోసి ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిసి రంగు మారి నాణ్యత దెబ్బతింటోంది.. ఏమీ చేయాలో దిక్కుతోచడం లేదు’ ఇదీ కొత్తపల్లి మండలంలోని మొక్కజొన్న రైతుల ఆవేదన..
కొత్తపల్లి మండలంలోని 12 గ్రామ పంచాయతీలలో ఖరీఫ్‌లో సుమారు 12,500 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట సాగు చేసిన తర్వాత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం రెవిన్యూ, వ్యవసాయ అధికారులకు నష్టపరిహారాన్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు కలిసి మండలంలోని గ్రామాల్లో పొలాలు తిరిగి 7,500 ఎకరాల దాకా పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచానా వేశారు. అక్టోబర్‌కు మొక్కజొన్న పంటకాలం పూర్తి కావడంతో కొన్ని గ్రామాల్లో రైతులు ఈ నెల మొదటి వారంలో కోతలు కోసుకొని ధాన్యంను ఆరబోసుకున్నారు. ధాన్యం కల్లాల్లో ఆరబోసుకున్న సమయంలో తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుడా వర్షాలు కురిశాయి. మొక్కజొన్న ధాన్యం మొత్తం వర్షపు నీటిలో తడిచి ముద్దయింది. దీంతో ధాన్యం రంగు మారి నాణ్యత దెబ్బతింది. దీనికి తోడు గింజల నుండి మొలకలు వస్తుండడంతో దాదాపు వేల క్వింటాళ్ల ధాన్యం అమ్ముడుపోక ఎక్కడికక్కడే రోడ్ల మీద టార్పలిన్ పట్టల కింద మగ్గిపోతుంది. ఇదే అదనుగా వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా మొక్కజొన్న ధాన్యంను ధరలు పూర్తిగా తగ్గించి అడుగుతుండడంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2300 ఉండగా వ్యాపారులు ధాన్యం దెబ్బతిందనే సాకుతో రూ.1800 నుంచి రూ.2 వేల లోపు అడుగుతున్నారు. మండలంలో ఇంకా 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట పొలాల్లో అలాగే ఉంది. గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కోత కోయని మొక్కజొన్న పంట నేల వాలి నీటి ముంపునకు గురయ్యాయి. కనీసం ఆ పంటలను కోసేందుకు మొక్కజొన్న మిషన్లు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కూలీలతో మొక్కజొన్న కంకులను కోపించాలన్నా పంట నేలవాలడంతో పాటు గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో కంకులను గుర్తుపట్టే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల కష్టమంతా వారం రోజుల్లోనే వర్షం పాలయింది. దీంతో ఈ ఏడాది పంటల కోసం తెచ్చిన అప్పులు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దెబ్బతిన్న మొక్కజొన్న పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కజొన్న కంకులు కుళ్లిపోతున్నాయి..- రైతు మద్దిలేటి, ఎర్రమఠం గ్రామం.
నాకు 9 ఎకరాల పొలం ఉంది. అందులో మొక్కజొన్న పంట 4 ఎకరాల్లో సాగు చేశాను. దాదాపు 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టాను. వర్షాల కారణంగా మొక్కజొన్న పంట పూర్తిగా నేలవాలిపోయింది. పంట కాలం పూర్తి కావడంతో మొక్కజొన్న కంకులు కొయ్యకపోవడం వల్ల వర్షాల కారణంగా కొన్ని కంకులు కుళ్లిపోయాయి. ఆగస్టులో కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కూడా సరిగ్గా అందలేదు. మాత్రం తూతూ మంత్రంగా వేశారు.
నేటికీ పొలాల్లోనే మొక్కజొన్న పంట- రైతు వెంకటేశ్వర్లు రైతు సింగరాజుపల్లి
గుమ్మడాపురం పొలిమేరలో 10 ఎకరాల పొలం ఉంది. అందులో 6 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశాను. దాదాపు 1 లక్ష 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. అయితే గతం వారంలో కురిసిన భారీ వర్షాలకు ఒక్క ఎకరా పంట కూడా కొయ్యలేదు. ఆరు ఎకరాల పంట మొత్తం కోసేందుకు అణువులేక పూర్తిగా గడ్డి మొలిచి ఏపుగా పెరిగింది. దీంతో కంకులను ఎలా కోయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నాం.