మిర్చి ధర పతనం..

Oct 17,2024 22:17

మిరపను కోస్తున్న మహిళా కూలీలు

మిర్చి ధర పతనం..
– కూలీల ఖర్చులు కూడా రాని వైనం
– పంటను తొలగిస్తున్న రైతులు
ప్రజాశక్తి – చాగలమర్రి
ఆరుగాలం కష్టించి, శ్రమించే రైతులు అతివృష్టి, అనావృష్టి, ధర పతనం కారణాలతో ఏటా నష్టపోతూనే ఉన్నారు. ఒకసారి ప్రకృతి ప్రకోపిస్తే, మరోసారి ధరలు పరిహాసం చేసి, మరోసారి పంటలు వైరస్‌, తెగుళ్ల బారిన పడుతుండడంతో రైతులు దిక్కుతోచక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పచ్చి మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. నియోజకవర్గంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో రైతులు పచ్చి మిర్చి సాగు చేశారు. చాగలమర్రి మండలంలో సుమారు 150 ఎకరాలలో మిర్చి పంట సాగు చేస్తున్నారు. పంట ధర పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పచ్చిమిర్చి కిలో రూ.10లు మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులు పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు. ప్రత్యామ్య్నాయ పంటల కోసం దున్నేస్తున్నారు. గిట్టుబాటు కావడం లేదురైతు ఈశ్వర్‌ రెడ్డి, కొత్తపల్లె గ్రామం.రెండు ఎకరాల్లో మిరప సాగు చేశా. ఎకరాకు రూ.90 వేలు పెట్టుబడి పెట్టాను. పంట కోతకు వచ్చే సమయంలో ధర పడిపోయింది. వచ్చిన మిరప సంపాదన కూలీలకు రవాణా ఖర్చులకే సరిపోతున్నది. ఆలమూరు నుంచి వ్యాపారులు వచ్చి మిరపను కొనుగోలు చేస్తారు. వారు చెప్పిన ధరకే ఇవ్వాల్సి వస్తోంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.రెండెకరాల్లో పంటను దున్నేశాను- రైతు గోపాల్‌, డి.వనిపెంట.రెండెకరాల్లో పచ్చిమిర్చి సాగు చేశాను. పంట దిగుబడి బాగా వచ్చింది. కానీ 50 కేజీల పచ్చిమిర్చి ధర రూ.750లకు కూడా కొనుగోలు చేయడం లేదు. మిర్చి కోత కోస్తే కూలి ఖర్చులు కూడా రావడం లేదు. అందుకే పంటను ట్రాక్టరుతో దున్నేశాను.

➡️