ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : భారత దేశ రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఆదివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోమేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి, కమిషనర్ భాగ్యలక్ష్మిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత దేశం కలిగి ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయమన్నారు. ప్రజలకు హక్కులు, స్వేచ్చా, సమానత్వం రాజ్యాంగం వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు. ఈరోజున మనం ప్రశాంతంగా, సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన వరం వల్ల మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర వేశారని ప్రతి యేటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్ర భారత దేశ చరిత్రలో రాజ్యాంగంలో ఏవైతే ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అణగారిన వర్గాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ ఆచరణకు నోచుకుంటున్నాయని కొనియాడారు. బిసి,ఎస్సీ,ఎస్టి మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతొందని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,కమల్ భూషణ్, ఇషాక్, అబూసాలెహా, అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, ఈఈ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.