డప్పు కళాకారులు చర్మకారులు సమస్యలు పరిష్కారం చేయాలి
డిసెంబర్ 11న చలో కలెక్టరేట్
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దళితులు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పునరుద్ధరణ చేయాలని, డప్పు కళాకారులు చర్మకారుల సమస్యలు పరిష్కారం చేయాలని డిసెంబర్ 11 చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ ఆనంద్ తెలిపారు. సోమవారం ఎల్బీజీ భవనంలో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45, 50 సంవత్సరాలుగా జిల్లాలో దళితులు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ జీవనం పొందుతున్నారని వారికి ప్రభుత్వం నేటికీ ఎటువంటి హక్కులు కల్పించలేదని ఆరోపించారు. భూ రిసర్వే పేరుతో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిస్తామని ప్రభుత్వం చెబుతున్న దానిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు కార్పొరేషన్ ద్వారా అందుతున్న 29 రకాల లోన్లను రద్దుచేసి స్వయం ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. డప్పు కళాకారులకు చర్మకారులకు 3000 రూపాయలు పింఛను ఇస్తున్నా పెరిగిన ధరలతో పోల్చుకుంటే చాలటం లేదని తెలిపారు. డబ్బులు, గజ్జలు, దుస్తులు, పనిముట్లు నేటి వరకు మంజూరు చేయలేదని అన్నారు. డప్పు కళాకారులకు శర్మకారులకు బస్సు పాస్ సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అర్హులైన దళితులకు రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని, స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని , ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అధికారపక్షం, పక్ష పార్టీలు దళితుల సమస్యల పట్ల మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు దళితుల సమస్యల పట్ల తమ వైఖరిని తెలియజేయాలని అన్నారు. పైన తెలిపిన సమస్యలు పరిష్కారం కోరుతూ డిసెంబర్ 11 చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్రావు, రాకోటి రాములు పాల్గొన్నారు.