ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండల కేంద్రమైన భట్టిప్రోలులో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య పెరుగుతుంది. వాటి అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ జరగలేదు. కారణంగా ఇరుకు మార్గంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకోవటానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద నుండి చావలి సెంటర్, పాత కేర్ కళాశాల వరకు రహదారి ఇరుకుగా ఉండటంతో ఈ ప్రాంతంలో వాహన చోదకులకు ప్రయాణం నరకయాతన అవుతుంది. ఈ మార్గంలో స్టేట్ బ్యాంకు తోపాటు మద్యం దుకాణం ఉండటం వలన వాహనదారులు రహదారిపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో పాఠశాల బస్సులు, ప్రభుత్వ బస్సులు, ఇతర వాహనాలు తిరగటానికి తీవ్ర ఆటంకంగా మారుతుంది. అలాగే చావలి సెంటర్ నుండి ఆంధ్ర బ్యాంకు వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామంలోనే కాక ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఆయా రకాల పాఠశాల, కళాశాల బస్సులతో కూడా ట్రాఫిక్ పెరిగిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 4గంటల నుండి 6గంటల వరకు ఈ రహదారి మార్గంలో పాఠశాల, కళాశాల బస్సులు వచ్చే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోయి వివిధ పనులపై వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊసే లేని రహదారి విస్తరణ పనులు
స్థానిక ప్రధాన రహదారి ఇరుకు మార్గంగా ఉండి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగుతొంది. రహదారి విస్తరించాలని గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రయత్నించారు. అయినప్పటికీ అది నెరవేరలేదు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలోనైనా ఆ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు. అయితే మంత్రి నాగార్జున చేపట్టిన చర్యలు ముందుకు సాగలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా రహదారి విస్తరణ నిలిచిపోయింది. ట్రాఫిక్ సమస్యపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.