ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెద్దపులివర్రు గ్రామంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి టి ఉదయభాస్కర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. పథకాలు ముందుకు కొనసాగాలంటే మరో మారు జగనే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళుతున్న రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు గ్రామానికి అందిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో వైసిపి జెండా ఆవిష్కరించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది వివరాలతో కూడిన కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
రేపల్లె : మండలంలోని కారుమురు గ్రామాల్లో ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి’ అనే వినూత్న కార్యక్రమాన్ని వైసిపి నియోజకవర్గం సర్పంచుల ఫోరం అధ్యక్షులు మండలి అంజయ్య ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన దిశగా కారుమూరు గ్రామాభివృద్ధిలో భాగంగా సుమారు రూ.30.67కోట్లను గ్రామ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల ద్వారా అంద జేశారని అన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని వైసిపి రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా అభివృద్దే మంత్రంగా కొనసాగుతున్నామని అన్నారు. జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పేందుకు, 2019లో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించారు. మళ్లీ జగనన్ననే సీఎంగా చేసుకోవాలని చెప్పే అద్భుతమైన కార్యక్రమఅ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుడి రమాదేవి, రామాయణం రత్తయ్య, కారుమూరు గ్రామ వైసిపి ఇంచార్జ్ గుడి శ్రీహరి, ఎంపీడీఒ శివ పార్వతి, ఇఒ పిఆర్డి మల్లికార్జునరావు పాల్గొన్నారు.
కారంచేడు : మండలంలోని కుంకలమర్రు సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ మళ్ళీ ఎందుకు కావాలి అనే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సర్పంచి ఈదర సౌందర్య అధ్యక్షత వహించారు. సభలో ఎంపీడీఒ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కుంకలమర్రు పంచాయతీలోని సచివాలయం రెండు పరిధిలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో రూ.14కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగాయని చెప్పారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈఓఆర్డి ఆర్ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి కె అంజయ్య పాల్గొన్నారు.