ప్రజాశక్తి – వేటపాలెం
ఓటు హక్కు ద్వారా మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకోవచ్చని తహశీల్దారు యు అశోకవర్ధన్ అన్నారు. స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటరు నమోదుపై మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా చట్ట సభలకు జరిగే ఎన్నికలలో ఓటు వేయటం ద్వారానే దేశంతో పాటు రాష్ట్రం కూడా ప్రగతి పధంలోకి దూసుకు పోగలదని అన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి విద్యార్ధి ఓటరు గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకోవాలని అన్నారు. అది తమ భాధ్యతగా గుర్తుంచుకోవాలని సూచించారు. స్వీప్ (సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిపేషన్) సౌజన్యంతో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్రని అన్నారు. అలాంటి విద్యార్ధి ఓటు హక్కు ద్వారా నిజాయితి గల నాయకుని ఎన్నుకుంటే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమమలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ డి జ్యోతి స్వరూప్, వివిధ విభాగాల హెచ్‌ఒడిలు పాల్గొన్నారు.