ప్రజాశక్తి-మార్కాపురం రూరల్
తప్పుడు దస్త్రాలను సృష్టించి అడ్డగోలుగా భూ ఆక్రమాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు జిల్లా కేంద్రమైన ఒంగోలు, మార్కాపురంలో ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) బృందం దర్యాప్తు వేగం పెంచింది. దీంతో ఆక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సిట్ బృందం అధికారులు కార్యాలయాలకు చేరుకొని తమకు కావాల్సిన దస్త్రాలను పరిశీలిస్తున్న క్రమంలో ప్రజాప్రతినిధుల నుండి సదరు అధికారులకు ఫోన్‌ల మీద ఫోన్‌లు వస్తున్నాయి. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తమ ప్రమేయం ఏదైనా ఉన్నట్లు తెలిస్తే ముందస్తు సమాచారం ఇవ్వవలసినదిగా అధికారులను వేడుకొంటున్నారు. ఇటీవల కాలంలో మార్కాపురం పట్టణంలోని సర్వే నెం.299/2సిలో య.1-08 సెంట్ల భూమికి తప్పుడు దస్త్రాలను సృష్టించి ఎనివేర్ కింద యర్రగొండపాలెం సబ్ రిజిష్ట్రర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒక ముఠా పథకం ప్రకారమే పూర్తిచేసింది. మార్కాపురం పట్టణంలో ఉన్న ఈ ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీ కింద సదరు ఆస్తికి రూ.35లక్షల మేర నగదును రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెల్లించారంటే ఆ ఆస్తి విలువ ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అధికారమే అండగా తప్పుడు ధృవీకరణ పత్రాలను, తప్పుడు వ్యక్తులను సృష్టించి కోట్ల రూపాయల ఆస్తిని కాజేయటమే ఈ ముఠా పనిగా పెట్టుకుంది. అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది ప్రభుత్వ అధికారులను ఎంచుకొని వారి సహాయ సహాకారాలతో యథేచ్ఛగా భూములను ఆక్రమించేశారు. అసలైన భూమి యాజమానులు సుదీర్ఘ కాలంగా ఈ ముఠా చేస్తున్న అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తూ సఫలీకృతులయ్యారు. తమ ఆస్తికి ఏ విధంగా తప్పడు దస్త్రాలు సృష్టించారో ఆధారాలతో సహా సంబంధిత అధికారుల కార్యాయాలకు వెళ్లి కళ్లకు కట్టినట్లు చూపించారు. బాధితులు సాక్ష్యాలతో సహా చూపించడంతో వెంటనే అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన రుజువులను అధికారులు తీస్తుండటంతో బూ అక్రమార్కులను అరెస్టు భయం వెంటాడుతోంది. కొందరు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు అధికారులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఈ ముఠాకు చెందిన అధికార పార్టీ నేతల భరతం పట్టడంలో సిట్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి.