భూములు సాధించేవరకు పోరాటం : పేదలతో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య

Nov 25,2023 00:09

ప్రజాశక్తి – పంగులూరు
పేదలంతా ఐక్యంగా నిలబడి, భూములను సాధించుకునే వరకు పోరాటం చేయాలని, పోరాటం చేయనిదే ఫలితం రాదని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. మండలంలోని తూర్పు తక్కెళ్ళపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన అలవలపాడు ,తూర్పు తక్కెలపాడు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల పేదల సమావేశంలో మాట్లాడారు. 1976లో కుటుంబం నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి పట్టాలు ఇచ్చార అన్నారు. కానీ ఆపరేషన్ చేయించుకున్న కొంతమందికి భూములు చూపించి కొంతమందికి చూపించలేదని అన్నారు. భూములు చూపించిన వాటిలో కూడా కొంతమంది భూములు భూస్వాములు దౌర్జన్యంగా వెనక్కి లాక్కున్నారని అన్నారు. ఇది చాలా దారుణమని అన్నారు. 22మందికి నేటికీ భూములు చూప లేదని అన్నారు. దశాబ్దాల తరబడి అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదని అన్నారు. ఇంతకాలం ఏం చేస్తున్నారని అధికారులు పేదలను ప్రశ్నిస్తున్నారని అన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా కోర్టులు చుట్టూ తిరిగిన ఫలితం కాన రాలేదని, పేదలు నిరుత్సాహ పడకూడదని, భూములు సాధించేందుకు పోరాడాలని అన్నారు. ఇందుకోసం సిపిఎం నిలబడుతుందని చెప్పారు. సిపిఎం జిల్లా నాయకులు రాయిని వినోద్ బాబు మాట్లాడుతూ పేదల భూముల కోసం, పేదల హక్కుల కోసం పోరాడేది సిపిఎం ఒకటేనని అన్నారు. భూ పోరాటాలు, ఇళ్ల స్థలాల పోరాటాలు, వివక్షకు వ్యతిరేక పోరాటాల వంటి ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఎంకి ఉందని అన్నారు. భూస్వాముల దగ్గర నుండి భూమిని లాక్కోవడం అంత సులువైన పని కాదని అన్నారు. ఐక్యంగా పోరాడితేనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం భూ పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు గుడిపాటి మల్లారెడ్డి, వేమూరి సునంద బాబు, పాలపర్తి రవి, ప్రేమ్ కుమార్, కుంట ఆదాం, పాలపర్తి సందీప్, మురికిపూడి అబ్దుల్లా, ఎం కోటేశ్వరరావు, ఎర్రమోతు రత్తయ్య, నూతలపాటి ఆశీర్వాదం, పత్తిపాటి కిరణ్, దుడ్డు సుబ్బారావు పాల్గొన్నారు.

➡️