టిడిపితోనే రాష్ట్రాభివృద్ది : ఎంఎల్‌ఎ గొట్టిపాటి

Nov 29,2023 23:38

ప్రజాశక్తి – అద్దంకి
టిడిపి పాలనతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పట్టణంలోని 5వ వార్డు రాజీవ్ కాలనీలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే అమలుచేసే పధకాలను ప్రజలకు వివరించారు. బాబు గ్యారెంటీ కార్డులను అందజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి, అన్నదాత, యువగళం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి రక్షిత నీటి పథకంతో పాటు పూర్‌ టు రిచ్ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. పేదల పేదల కడుపు నింపడం కోసం చంద్రబాబు తెచ్చిన అన్నా క్యాంటీన్లు, పండుగలకు ఇచ్చిన కానుకలు, పెళ్ళికానుకలు వంటి పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. అలాంటి పథకాలను రద్దు చేసిన జగన్‌రెడ్డి పేదల పక్షపాతి ఎలా అవుతారని ప్రశ్నించారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలని దోచుకుంటున్న జగన్ ఇంకా పేదల మనిషని చెప్పుకునే అర్హత లేదని అన్నారు. జగన్‌రెడ్డిని గద్దెదించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వలేని చేతగాని చెత్త సిఎం అని ఆరోపించారు. జగన్‌రెడ్డి వచ్చాక పేదల సొంతింటి కల పెనుభారంగా మారిందని అన్నారు. అధికారం కోసం అబద్దాలు చెప్పి ఇప్పుడు పేదలను మోసం చేస్తున్నాడని అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం టిడిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,13,832లక్షల గృహలు 90శాతం పూర్తి చేసిందని అన్నారు. అందులో భాగంగా మొదటిదశలో అద్దంకి నగర పంచాయతీలోని శింగరకొండ వద్ద వెయ్యికిపైగా టిడ్కొ ఇళ్ల నిర్మాణాలు 90శాతం పనులు పూర్తి చేశామని, వైసిపి అధికారానికి వచ్చిన తర్వాత మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా పేదలను మోసం చేశాడని ఆరోపించారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత మంచినీటి పధకానికి టిడిపి హయాంలో తాను రూ.84కోట్లు మంజూరు చేయించానని అన్నారు. నేటికీ పనులు పూర్తి చేయలేని జగన్‌ ప్రభుత్వం ప్రజపట్ల బాధ్యత ఏమిటో అర్ధం చేసుకోవాలని కోరారు. గుండ్లకమ్మ నుండి శింగరకొండ టిడ్కో గృహాల వరకు నీటిని అనుసంధానం చేస్తూ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదించి తాను నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో వైసిపి కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు గత ఆగస్టులో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి తెలిపారని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను చూపించి మరో రూ.4వేల కోట్ల అప్పుకోసం వైసిపి జగన్‌ ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. టిడిపి ప్రభుత్వం రూ.4,600కోట్ల ఖర్చుతో 3.20లక్షల ఇళ్ళు నిర్మించినట్లు తెలిపారు. జగన్‌ వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారని అన్నారు.
కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిని చేసి చంపారని అన్నారు. మద్యం రాబడిని ఆదాయంగా చూపించుకొని అప్పులు తెచ్చుకోవడమే మద్యపాన నిషేధమా అని ప్రశ్నించారు. మద్యం నిషేధిస్తామని మహిళలను మోసం చేశాడని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి పెరగడంతో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. హత్యలు, మానభంగాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు.

➡️