ప్రజాశక్తి – వేటపాలెం
జాతీయ రహదారి వెంట రోజురోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక బిబిహెచ్ డిగ్రీ కాలేజీ, బైపాస్ జంక్షన్ వద్ద ఉన్న సర్వే నంబర్ 192/4బి, 4సి సొనను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లతో పూడ్చి వేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి నిలుపుదల చేశారు. అంతే వేగంగా అజ్ఞాత ఫోన్ కాల్‌తో అధికారులు వెనక్కి వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలోనే సొన పూర్తిగా పూడ్చివేశారు. ఈ సంఘటన ప్రత్యక్షంగా తిలకించిన ప్రజలు ఆశ్చర్య వ్యక్తం చేశారు. సొన దగ్గరుండి పూడుస్తున్న వ్యక్తులు మాత్రం బస్సు షెల్టర్ నిర్మాణానికని చెప్పటం గమనర్హం. సుమారు అర ఎకరం సొన భూమిలో టీ స్టాల్ నిర్మాణం కోసం షెల్టర్ ఉన్నాయి. మిగిలిన కొద్ది భూమిని సైతం పూడ్చివేయటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానిక రెవిన్యూ అధికారులు మాట్లాడక పోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని సొన భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.