పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : వికసిత్ సంకల్ప యాత్ర ప్రారంభించిన కలెక్టర్

Nov 26,2023 01:52

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. కేంద్ర నుంచి వచ్చిన వికసిత్ సంకల్ప యాత్ర వాహనాన్ని మండలంలోని ఈతేరు గ్రామంలో కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. వాహనంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్‌లో ప్రసారమవుతున్న 7.5 నిమిషాల నిడివిగల లఘు చిత్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. లబ్ధిదారులు తమ అనుభవాలను వివరించారు. ప్రజలను చైతన్య పరుస్తూ ప్రదర్శించిన నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ సంకల్ప యాత్ర చేపట్టిందని అన్నారు. ఇప్పటి నుంచి 2024జనవరి 26వరకు జిల్లాలోని 459పంచాయతీల్లో యాత్ర సాగుతుందని అన్నారు. ఇందుకోసం జిల్లాకు నాలుగు వాహనాలు కేంద్రం నుంచి వచ్చాయని అన్నారు. ప్రతిరోజు నాలుగు రూట్లలో వాహనాలు పర్యటించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లాస్థాయి, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేకంగా అధికారులతో కమిటీలు నియమించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా కారణాలతో మిగిలిపోయిన అర్హులైన లబ్దిదారులకు పథకాలను వర్తింప చేయడమే ఉద్దేశం అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయా పథకాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలతో ప్రజలంతా సాధికారతవైపు అడుగులు వేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గం సుగుమం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పక్కా గృహాల నిర్మాణం, ఇంటింటికి కొలాయి కనెక్షన్‌తో తాగనీరు వంటి 17 రకాల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డిఓ జి రవీందర్, డిపిఒ డి రాంబాబు పాల్గొన్నారు.

➡️